తెలంగాణలో మోగిన లాక్ డౌన్ సైరన్..
తెలంగాణలో ఈనెల 15నుంచి లాక్ డౌన్ అంటూ ప్రచారం జోరందుకుంది. అధికారిక ప్రకటన ఈరోజు విడుదలవుతుందని చెబుతున్నా.. అనధికారికంగా మీడియాకు లీకులిచ్చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ తర్వాతి రోజే.. సీఎం కేసీఆర్ లౌక్ డౌన్ పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతోందా అంటూ లాజిక్ తీశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి, మేథావులు, ఇతర […]
తెలంగాణలో ఈనెల 15నుంచి లాక్ డౌన్ అంటూ ప్రచారం జోరందుకుంది. అధికారిక ప్రకటన ఈరోజు విడుదలవుతుందని చెబుతున్నా.. అనధికారికంగా మీడియాకు లీకులిచ్చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఆ తర్వాతి రోజే.. సీఎం కేసీఆర్ లౌక్ డౌన్ పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతోందా అంటూ లాజిక్ తీశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి, మేథావులు, ఇతర వర్గాల వారు సైతం.. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గుతుందని మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాలు రుజువు చేశాయని, ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటుతుందని హెచ్చరించారు.
ఏపీ నిర్ణయంతో పెరిగిన ఒత్తిడి..
పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో 18గంటల కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. దీంతో ఆ ప్రభావం తెలంగాణపై బలంగా పడింది. తెలంగాణ నేరుగా కర్ఫ్యూ పెట్టకపోయినా.. ఏపీలో కర్ఫ్యూ ప్రభావం పరోక్షంగా ఆ రాష్ట్రంపై కనపడుతోంది. దీంతో అనివార్యంగా కేసీఆర్ కూడా లాక్ డౌన్ కి సిద్ధమయినట్టు తెలుస్తోంది. రంజాన్ పండగ పూర్తయిన తర్వాత, ఈనెల 15నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వస్తుందని చెబుతున్నారు. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు, విధి విధానాలు ప్రకటిస్తారు.
ఉన్నట్టుండి లాక్ డౌన్ ప్రకటించకుండా, దానిపై ముందుగానే లీకులిచ్చి.. ఎక్కడివారక్కడ లాక్ డౌన్ కి తగ్గ ఏర్పాట్లు చేసుకోడానికి ప్రభుత్వం అవకాశమిచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో ఉన్న వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రెండుమూడు రోజుల్లో తమ స్వస్థలాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుందని, ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి వీలవుతుందని, ధాన్యం కొనుగోళ్లు క్రమబద్ధీకరించడానికి కూడా అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. అందుకే నాలుగు రోజుల ముందుగానే లాక్ డౌన్ పై టీఆర్ఎస్ సర్కారు హింట్ ఇచ్చేసింది.
తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ తరహా ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఒక్క తెలంగాణలో మాత్రమే కేవలం రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. మరోవైపు ఇతర ప్రాంతాలకు చెందిన కరోనా రోగులు సైతం.. హైదరాబాద్ ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కేసుల ఒత్తిడి తగ్గించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై ముందడుగు వేస్తోంది. వద్దు వద్దంటున్నా కేసీఆర్ కూడా వివిధ వర్గాలనుంచి వస్తున్న ఒత్తిడికి తలవంచక తప్పడంలేదు.