Telugu Global
National

వ్యాక్సినేషన్ ప్రక్రియ భేష్.. కేంద్రం సెల్ఫ్ సర్టిఫికెట్..

భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని కేంద్రం సమర్థించుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థంగా ఉందని, దానిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన విచారణలో భాగంగా కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ సాంకేతిక కారణాల కారణంగా అర్థాంతరంగా వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ […]

వ్యాక్సినేషన్ ప్రక్రియ భేష్.. కేంద్రం సెల్ఫ్ సర్టిఫికెట్..
X

భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని కేంద్రం సమర్థించుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థంగా ఉందని, దానిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన విచారణలో భాగంగా కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ సాంకేతిక కారణాల కారణంగా అర్థాంతరంగా వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ విచారణను మే-13కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

అఫిడవిట్ లో కేంద్రం పేర్కొన్న అంశాలివే..
కరోనా సంక్షోభం వేళ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. ప్రజా ప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని చెప్పింది. 218 పేజీల సుదీర్ఘ అఫిడవిట్ లో కేంద్రం తన నిర్ణయాలను, వాటి అమలు తీరుని పూర్తిగా సమర్థించుకుంది. ఒకవేళ కేంద్రం నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే.. మునుపెన్నడూ చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సి వస్తుందని అఫిడవిట్ లో పేర్కొంది. భారత్ లో టీకా ధరలు సహేతుకంగానే కాకుండా, దేశవ్యాప్తంగా ఒకే రీతిలో ఉన్నాయని వివరించింది. పోటీతత్వ మార్కెట్ ని ఏర్పరచడం, ప్రైవేటు వ్యాక్సిన్ తయారీదారుల మధ్య ప్రోత్సాహక డిమాండ్‌ సృష్టించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లోనే వ్యత్యాసాలు ఉన్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు విదేశీ టీకా తయారీదారులు కూడా దేశంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. తద్వారా వ్యాక్సిన్ల లభ్యతను పెంచొచ్చని తెలిపింది. ధరల్లో వ్యత్యాసం ఉన్నా దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత టీకా అందుతోందని కేంద్రం వివరించింది. 18-45 మధ్య వయసున్నవారికి కూడా అనేక రాష్ట్రాలు ఉచిత టీకాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. కరోనా బాధితులు దేశంలో ఎక్కడైనా చికిత్స తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. కొవిడ్‌ కేంద్రాలు, బెడ్లు, సిబ్బందిని పెంచామని, వైద్య విద్యార్థులను కూడా కొవిడ్‌ సేవల్లో భాగస్వాములను చేశామని తెలిపింది.

సర్వర్ డౌన్ కారణంగా విచారణ వాయిదా..
భారత్ లో వ్యాక్సినేషన్, కొవిడ్ పరిస్థితులపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌ లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కొవిడ్ వ్యాక్సిన్ ధర్లలో వ్యత్యాసాలు, ఆక్సిజన్ లభ్యతపై కేంద్రాన్ని ప్రత్యేక ధర్మాసనం నిలదీసింది. సుమోటోగా ఈ కేసు టేకప్ చేయడంతోపాటు.. 20 అనుబంధ పిటిషన్లను కూడా ఇందులోనే కలిపి విచారణ జరుపుతామంది. ప్రస్తుతం కేంద్రం దాఖలు చేసిన సుదీర్ఘ అఫిడవిట్ ని ప్రత్యేక ధర్మాసనం పరిశీలిస్తున్నట్టు తెలిపింది. సర్వర్ డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణకు పలుమార్లు అంతరాయం కలగగా.. మే 13కి విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రత్యేక ధర్మాసనం ప్రకటించింది.

First Published:  10 May 2021 1:31 PM IST
Next Story