Telugu Global
Andhra Pradesh

హనుమద్ జన్మభూమి ట్రస్ట్ కు టీటీడీ కౌంటర్..

హనుమంతుడి జన్మస్థలం విషయంలో టీటీడీకి, కర్నాటక కిష్కింధలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరులేనంటూ గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే దీని వెనక పెద్ద కసరత్తే జరిగింది.

TTD Counter to Hanumad Janmabhoomi Trust
X

హనుమంతుడి జన్మస్థలం విషయంలో టీటీడీకి, కర్నాటక కిష్కింధలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరులేనంటూ గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే దీని వెనక పెద్ద కసరత్తే జరిగింది. ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని కనుగొనాలని పండిత పరిషత్‌ ఏర్పాటుచేసి 4నెలల పాటు పరిశోధన జరిపించింది టీటీడీ. పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలంగా రూఢీ చేసుకుని పండిత పరిషత్ ఓ నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను విడుదల చేస్తూ, త్వరలో ఆంజనేయుడి జన్మస్థలంపై ఓ పుస్తకాన్ని ముద్రిస్తామని ప్రకటించింది టీటీడీ.

అయితే టీడీడీ విడుదల చేసిన నివేదికపై కర్నాటక కిష్కింధలోని శ్రీ హనుమద్ జన్మభూమి ట్రస్ట్ పలు ఆరోపణలు చేసింది. టీటీడీ నివేదిక తప్పు అంటూ.. హనుమంతుడి జన్మస్థలంపై వివాదాలు సృష్టించడం సరికాదంటూ ఓ లేఖ రాసింది. కర్నాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు కూడా టీటీడీ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంజనేయుని పుట్టుక ప్రాంతం హంపి అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారంటున్నారు. అయితే హనుమద్ జన్మభూమి ట్రస్ట్ లేఖ రాయడంపై టీటీడీ తీవ్ర స్థాయిలో మండిపడింది. సదరు ట్రస్టు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు. శ్రీహనుమద్‌ జన్మభూమి ట్రస్టు లేఖకు టీటీడీ ఆధ్వర్యంలో ఆయన ప్రత్యుత్తరాన్ని పంపారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినీ ఆక్షేపించకుండా మంచి భాషతో తాము నివేదికను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. హనుమంతుడి జన్మస్థలంపై తాము చేసిన కృషిని ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా భక్తుల నుండి ప్రశంసలు అందాయని చెప్పారు. తమ నివేదికపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని గతంలో టీటీడీ అందరినీ కోరిందని, అయితే హనుమద్ జన్మభూమి ట్రస్ట్ ప్రస్తావించిన విషయాలు, లేఖలో వారు వాడిన భాష సరిగా లేదని ఆక్షేపించారు. ఇటీవలే కర్నాటకలో రిజిస్టర్ అయిన సదరు ట్రస్ట్.. హనుమంతుడి జన్మస్థలంపై మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలంటూ లేఖ రాయడం టీటీడీని అగౌరవ పరచడమేనని అన్నారు. దైవకార్యాన్ని దూషించినందుకు వెంటనే టీటీడీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.

టీటీడీ నివేదికలో పొందపరిచిన విషయాలు ఎలా నిరాధారమో హనుమద్ జన్మభూమి ట్రస్ట్, మే 20వ తేదీ లోపు నిరూపించాలని, అలా నిరూపిస్తూ నివేదిక సమర్పిస్తే.. కరోనా ప్రభావం తగ్గాక వారిని చర్చలకు ఆహ్వానిస్తామని లేఖలో బదులిచ్చారు. మొత్తమ్మీద హనుమద్ జన్మభూమి ట్రస్ట్ కు టీటీడీ తరపున వెళ్లిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

First Published:  9 May 2021 6:34 AM IST
Next Story