Telugu Global
National

స్పుత్నిక్ తర్వాత భారత్ లో రాబోయే టీకా అదే..

ఇప్పటి వరకూ భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ల పంపిణీ జరుగుతోంది. భారత్ బయోటెక్, సీరం సంస్థలు వీటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి. అయితే తయారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో భారత్ లో వ్యాక్సినేషన్ బాగా నెమ్మదించింది. వ్యాక్సిన్ ఇవ్వండి మహా ప్రభో అంటూ రాష్ట్రాలు వేడుకుంటున్నా కేంద్రం చేష్టలుడిగి చూడటం మినహా చేయగలిగిందేమీ లేదు. ఈ సందర్భంలో మరిన్ని టీకాలకు అనుమతి వస్తుందని అనుకున్నా అది కూడా ఆలస్యం అవుతోంది. కొవాక్సిన్, కొవిషీల్డ్ తర్వాత […]

స్పుత్నిక్ తర్వాత భారత్ లో రాబోయే టీకా అదే..
X

ఇప్పటి వరకూ భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ల పంపిణీ జరుగుతోంది. భారత్ బయోటెక్, సీరం సంస్థలు వీటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి. అయితే తయారీ ప్రక్రియ ఆలస్యం కావడంతో భారత్ లో వ్యాక్సినేషన్ బాగా నెమ్మదించింది. వ్యాక్సిన్ ఇవ్వండి మహా ప్రభో అంటూ రాష్ట్రాలు వేడుకుంటున్నా కేంద్రం చేష్టలుడిగి చూడటం మినహా చేయగలిగిందేమీ లేదు. ఈ సందర్భంలో మరిన్ని టీకాలకు అనుమతి వస్తుందని అనుకున్నా అది కూడా ఆలస్యం అవుతోంది. కొవాక్సిన్, కొవిషీల్డ్ తర్వాత భారత్ లో స్పుత్నిక్-వి టీకా అందుబాటులోకి రావాల్సి ఉంది. దీని తర్వాత జైకోవ్-డి అనే వ్యాక్సిన్ లైన్లో ఉంది. గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా టీకాకు అనుమతులు లభిస్తాయని చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘జైకోవ్‌-డి’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. 28వేల మందిపై ప్రయోగాలు చేశామని సంస్థ చెబుతోంది. మధ్యంతర సామర్థ్య ఫలితాలు వచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తారు. అత్యవసర అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని జైడస్ ఎండీ శార్విల్ పటేల్ తెలిపారు. దీన్ని మూడు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుందని, ఇది నొప్పి లేని టీకా అని ఆయన స్పష్టం చేశారు. రెండు డోసుల టీకాపై కూడా తాము ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పారు. జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన విరాఫిన్ అనే ఔషధాన్ని కరోనా చికిత్సలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు అదే సంస్థ టీకాను కూడా మార్కెట్లోకి తీసుకు రాబోతోంది.

స్పుత్నిక్-వి పరిస్థితి ఏంటి..?
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీజీసీఐ) ఏప్రిల్ లో అనుమతి ఇచ్చింది. ఆర్డీఐఎఫ్ సహకారంతో గమలేయా ఇన్‌ స్టిట్యూట్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌ లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్‌ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఇటీవల వినియోగ అనుమతులు పొందింది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాలు ఈనెల 1న హైదరాబాద్‌ చేరుకున్నాయి. రష్యానుంచి 1.5 లక్షల టీకా డోసుల్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ దిగుమతి చేసుకుంది. తుది అనుమతులు వచ్చిన తర్వాత వీటిని భారత్ లో వినియోగంలోకి తీసుకొస్తారు. అన్నీ అనుకూలిస్తే స్పుత్నిక్-వి తర్వాత జైకోవ్-డి టీకా అందుబాటులోకి వస్తుంది. కొవాక్సిన్, కొవిషీల్డ్ తోపాటు.. మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తే.. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

First Published:  8 May 2021 11:51 AM IST
Next Story