Telugu Global
National

అంతా తూచ్.. థర్డ్ వేవ్ రానే రాదు..

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పై డాక్టర్ కె.విజయ రాఘవన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు విజయ రాఘవన్ సాదా సీదా డాక్టర్ కాదు, కరోనాపై ఊహాజనిత వార్తలు రాసే సోషల్ మీడియా మేథావి అంతకంటే కాదు. ఆయన ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారే.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ఎప్పుడొస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం […]

అంతా తూచ్.. థర్డ్ వేవ్ రానే రాదు..
X

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పై డాక్టర్ కె.విజయ రాఘవన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు విజయ రాఘవన్ సాదా సీదా డాక్టర్ కాదు, కరోనాపై ఊహాజనిత వార్తలు రాసే సోషల్ మీడియా మేథావి అంతకంటే కాదు. ఆయన ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారే.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, ఎప్పుడొస్తుందో తెలియదు కానీ రావడం మాత్రం ఖాయమని, వస్తే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో సామాన్య ప్రజలే కాదు, కేంద్రం కూడా షాకయ్యింది. అంతా సవ్యంగానే ఉందంటూ కేంద్రం సర్దిచెప్పుకుంటున్న వేళ, వ్యాక్సినేషన్ లోపాల్ని కప్పి పుచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వేళ, థర్డ్ వేవ్ అంటూ విజయ రాఘవన్ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని కూడా ఇబ్బందుల్లో పెట్టాయి. దీంతో రెండు రోజులు గడిచేలోగా సదరు శాస్త్రీయ సలహాదారు తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ అన్ని ప్రదేశాల్లో రాకపోవచ్చని, అసలు ఎక్కడా రాకపోవచ్చని మాట మార్చారు.

అవసరమైన చర్యలు తీసుకుంటే కరోనావైరస్ మూడో దశను ఓడించలగమంటూ తాజాగా చెప్పుకొచ్చారు విజయ రాఘవన్. కఠిన చర్యలు తీసుకుంటే, మూడో వేవ్‌ అన్ని ప్రదేశాలలోనూ రాకపోవచ్చు. అసలు ఎక్కడా రాకపోవచ్చని అన్నారు. ఆయా రాష్ట్రాలలో, జిల్లాల్లో ఎంత బాగా ఆంక్షలను, మార్గదర్శకాలను అమలు చేస్తారనేదానిపై వైరస్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. థర్డ్ వేవ్ పై విజయ రాఘవన్ వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా పట్టించుకోవాలా, వద్దా అనే విషయాన్ని పక్కనపెడితే.. కనీసం సెకండ్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొనే పరిస్థితులు కూడా భారత్ లో లేవని తేలిపోయింది. రోజుకి అధికారికంగా 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా అంతకు మించి అని తేలుతోంది. అంతర్జాతీయ రికార్డులన్నీ భారత్ లో బద్దలవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్‌ లేవు, ఆక్సిజన్‌, మందుల కొరత వేధిస్తోంది. ఇటు వ్యాక్సిన్ దొరకట్లేదు. కనీసం శ్మశానవాటికలు కూడా ఖాళీ లేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది కానీ సెకండ్ వేవ్ ని ఎదుర్కోడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడంలేదు.

సెకండ్ వేవ్ తో ప్రధాని మోదీ ప్రభ మసకబారింది, దిగిపోవయ్యా ఇక చాలంటూ.. మర్యాదగానే ఆయన్ని దెప్పిపొడుస్తున్నారు మేథావులు. ఈ దశలో థర్డ్ వేవ్ భయాలపై విజయ రాఘవన్ స్పందించే సరికి కేంద్రం ఆయన నోరు కట్టేసింది. అదే నోటివెంట.. అంతా తూచ్ అంటూ చెప్పించేసింది. కేంద్ర పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మాటమార్చి, ప్రజల్ని ఏమార్చాలనుకోవచ్చు కానీ, సామాన్య ప్రజల కష్టాలు మాత్రం కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోదీ సహా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరిపై ఉంది. కేంద్రం కన్నెర్ర చేస్తే విజయ రాఘవన్ మాటలు మారిపోతాయి కానీ, ప్రజల కష్టాలు తీరతాయా. ఇంకా కరోనాకి మసిపూసి మారేడుకాయ చేయాలని చూడటం కేంద్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.

First Published:  8 May 2021 8:55 AM IST
Next Story