Telugu Global
National

బెంగాల్ తో కేంద్రం తాడో పేడో..

పశ్చిమబెంగాల్ లో విజయం ఆశించి భంగపడ్డ బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల గురించి కేంద్రం రచ్చ చేయడం మొదలు పెట్టింది. తొలుతగా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించడం, గవర్నర్ కు లేఖ రాసి విచారం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో గవర్నర్ జగదీప్ ధన్ కర్.. […]

బెంగాల్ తో కేంద్రం తాడో పేడో..
X

పశ్చిమబెంగాల్ లో విజయం ఆశించి భంగపడ్డ బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల గురించి కేంద్రం రచ్చ చేయడం మొదలు పెట్టింది. తొలుతగా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించడం, గవర్నర్ కు లేఖ రాసి విచారం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో గవర్నర్ జగదీప్ ధన్ కర్.. సంప్రదాయాలకు విరుద్ధంగా బెంగాల్ అల్లర్ల గురించి ప్రస్తావించి, రాష్ట్ర ప్రభుత్వానికి సుద్దులు చెప్పారు. అయితే అదే వేదికపై గవర్నర్ ని సైతం విమర్శించి దీదీ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇన్నాళ్లూ ఎన్నికల కమిషన్, గవర్నర్ పాలనలో రాష్ట్రం ఉందని, ఇకపై టీఎంసీ పాలనలో అల్లర్లకు తావుండదని బదులిచ్చారామె. అయితే అక్కడితో వ్యవహారం సద్దుమణగలేదు. కేంద్రం ఈ అల్లర్ల విషయంలో మరింత ఎక్కువగా జోక్యం చేసుకోవడం మొదలు పెట్టింది.

పశ్చిమబెంగాల్‌ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ కర్‌ ను నివేదిక కోరింది. దుర్ఘటనలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరామని, అయితే ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందనా లేదని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ను నేరుగా నివేదిక ఇవ్వాలని కోరింది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్ర వివరాలు తెలియజేయాలని సూచించింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని చెప్పడం విశేషం. అంతే కాదు, హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖ నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది కూడా. ఈ బృందం ఆల్రడీ బెంగాల్ లో అడుగు పెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బెంగాల్ వస్తారని వార్తలొచ్చినా దానికింకా సమయం పట్టేట్టు కనిపిస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా బెంగాల్ అల్లర్లను హైలెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలో మౌన దీక్షలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నికల అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను హతమార్చారని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్రమంత్రి మురళీధరన్‌ కారుపై రాళ్లు, కర్రలతో జరిగిన దాడికి కూడా తృణమూల్ కార్యకర్తలే కారణం అంటూ బీజేపీ ఓ వీడియోని కూడా విడుదల చేసింది. వీటన్నిటినీ టీఎంసీ తోసిపుచ్చింది.

ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. ఓ రాష్ట్రంలో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా నేరుగా కేంద్ర హోంశాఖ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, గవర్నర్ ను నివేదిక కోరడం చూస్తుంటే.. దీదీతో తాడోపేడో తేల్చుకోడానికి కేంద్రం సిద్ధమయినట్టు తెలుస్తోంది. మరోవైపు బెంగాల్ అల్లర్లను హైలెట్ చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను టీఎంసీ తీవ్రంగా తప్పుబడుతోంది. కరోనా కట్టడిలో విఫలమైన ప్రధాని మోదీ, దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకం ఆడుతున్నారంటోంది. వ్యాక్సిన్ సరఫరా, ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం అసమర్థత ప్రజలు గుర్తించారని, ఎన్డీఏ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు టీఎంసీ నేతలు.

First Published:  7 May 2021 2:10 AM IST
Next Story