Telugu Global
NEWS

లాక్ డౌన్ తో కేసులు తగ్గవు.. తెలంగాణలో నో లాక్ డౌన్..

ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడంలేదని, అందుకే గత అనుభవాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ తో ప్రజాజీవనం స్తంభించిపోతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందని అన్నారు. కరోనానుంచి కోలుకున్న అనంతరం తొలిసారిగా ప్రగతి భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి […]

లాక్ డౌన్ తో కేసులు తగ్గవు.. తెలంగాణలో నో లాక్ డౌన్..
X

ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడంలేదని, అందుకే గత అనుభవాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ తో ప్రజాజీవనం స్తంభించిపోతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందని అన్నారు. కరోనానుంచి కోలుకున్న అనంతరం తొలిసారిగా ప్రగతి భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, రెమిడిసెవిర్ ఇంజక్షన్ల సరఫరాపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ ఫోన్‌ లో మాట్లాడారు. వాటిన్నిటికీ తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలనుంచి తెలంగాణకు కేటాయించిన ఆక్సిజన్‌ వివిధ కారణాల వల్ల అందడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ కు కరోనా బాధితులు రావడం వల్ల భారం పెరిగిందని వివరించారు. రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని.. దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు. కేంద్రం ఇప్పటివరకు తెలంగాణకు 50 లక్షల డోసుల టీకా సరఫరా చేసిందని, రాష్ట్రంలో రోజుకు 2లక్షల నుంచి 2.5 లక్షల డోసుల టీకా అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సీఎం కేసీఆర్‌ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కర్నాటక, తమిళనాడునుంచి కాకుండా.. ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలనుంచి తెలంగాణకు సరఫరా చేస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని.. వారం రోజుల్లో వాటి సంఖ్యలను మరో ఐదు వేలకు పెంచాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఆక్సిజన్‌ సరఫరా మెరుగు చేయడం కోసం ఒక్కొక్కటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజెనిక్‌ ట్యాంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలని సీఎస్‌ సోమేష్ కుమార్‌ కు సీఎం ఆదేశాలిచ్చారు. కొవిడ్‌ విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సీఎం కోరారు. అనుమానం ఉన్నవారు టెస్టుల కోసం ఆదుర్దా చెందకుండా.. ప్రభుత్వం అందించే కొవిడ్‌ మెడికల్‌ కిట్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటికీ కొవిడ్ మెడికల్ కిట్లు అందజేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాస్పటల్స్, ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం 5980 కొవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని, వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు కేసీఆర్.

First Published:  7 May 2021 1:41 AM IST
Next Story