ఈటలపై మారుతున్న టీఆర్ఎస్ స్వరం..
ఈటల రాజేందర్ వ్యవహారంలో టీఆర్ఎస్ స్వరం పూర్తిగా మారుతోంది. మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత ఈటలకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై మాత్రమే స్పందించిన టీఆర్ఎస్ మంత్రులు, నేతలు.. ఇప్పుడు నేరుగా ఈటలను టార్గెట్ చేశారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు, బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అంటూ తీవ్రంగా విమర్శించారు. బీసీ ముసుగులో ఉన్న దొర.. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ అంటూ మంత్రి గంగుల కమలాకర్ […]
ఈటల రాజేందర్ వ్యవహారంలో టీఆర్ఎస్ స్వరం పూర్తిగా మారుతోంది. మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత ఈటలకు మద్దతుగా ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై మాత్రమే స్పందించిన టీఆర్ఎస్ మంత్రులు, నేతలు.. ఇప్పుడు నేరుగా ఈటలను టార్గెట్ చేశారు. ఈటల వ్యాఖ్యలను ఖండించారు, బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అంటూ తీవ్రంగా విమర్శించారు.
బీసీ ముసుగులో ఉన్న దొర..
బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల హుజూరాబాద్ లో ఉంటే బీసీ, హైదరాబాద్ లో ఉంటే ఓసీ అని ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నప్పుడు ఈటలకు బీసీలు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ముదిరాజ్ సమస్యలపై మాట్లాడారా? అని మంత్రి కమలాకర్ నిలదీశారు.
అసైన్డ్ భూములు కొని.. ఆత్మగౌరవం దెబ్బతింది అంటారా..?
అసైన్డ్ భూములను వ్యాపారం కోసం కొన్నట్లు ఈటలే స్వయంగా చెప్పారని.. 1995లో పేదలకు ఇచ్చిన ఆ భూములను కొనడం తప్పు అనిపించలేదా? అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. దాదాపు రూ.కోటిన్నర విలువ చేసే భూములను రూ.6లక్షలకే ఎలా కొన్నారని ఆయన నిలదీశారు. రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రభుత్వం, సీఎంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని అడిగారాయన. అభివృద్ధిని అడ్డుకోవడం.. పార్టీని గందరగోళానికి గురిచేయడమే ఈటల ఉద్దేశమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు అని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్. పార్టీలో తొలి నుంచీ ఆయనకు ప్రాధాన్యమివ్వడాన్ని తాము కళ్లారా చూశామని అన్నారు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి 23 మంది ఆశావహులు ఉన్నా కూడా ఈటలకు ఏరికోరి టికెట్ ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. శాసన సభలో ఫ్లోర్ లీడర్ ని చేయడం, రెండు సార్లు మంత్రిని చేయడం, మంత్రివర్గ ఉప సంఘంలో ప్రాధాన్యం కల్పించడం.. ఇవన్నీ దేనికి సంకేతాలన్నారు.
మంత్రుల విమర్శలు అవాస్తవం..
మంత్రులు కొప్పుల ఈశ్వర్, కమలాకర్ తనపై చేసిన విమర్శలు అసత్యాలని అన్నారు ఈటల రాజేందర్. ప్రగతి భవన్ లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని ఆయన విమర్శించారు. సీఎంకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కలవడానికి మంత్రులు వెళితే, లోపలకు అనుమతించలేదని ఆరోపించారు. ఇంత అహంకారమా? అని ఆరోజు మంత్రి గంగుల కమలాకర్ తనతో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అలాంటి కమలాకర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని చెప్పారు. తన వ్యవహారం నచ్చకపోతే పిలిపించి అడిగితే నేనే రాజీనామా చేసేవాడినని చెప్పారు ఈటల. ఇప్పుడు తనను విమర్శిస్తున్నవారంతా తన సహచరులేనని, మంత్రులు చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తానెప్పుడూ ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదని, కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు కేటీఆరే సీఎం కావాలని తాను చెప్పినట్టు గుర్తు చేశారు ఈటల.
ఈటల వ్యవహారంలో ప్రభుత్వ తీరుని తప్పుబట్టిన హైకోర్టు..
మరోవైపు ప్రభుత్వ అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని, బలవంతంగా సర్వే చేస్తున్నారని, వారి చర్యలను నిలుపుదల చేయాలంటూ.. జమున హేచరీస్ తరపున ఈటల సతీమణి, కుమారుడు హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం సర్వే జరిపిన తీరును తప్పుబట్టింది. సర్వే చేసే ముందు నోటీసు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహజ న్యాయసూత్రాలను అధికారులు తీవ్రంగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జమున హేచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.