Telugu Global
National

జాతీయ టీకా విధానం ప్రకటించాల్సిందే -సుప్రీంకోర్టు

భారత్ లో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ అమలు తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకా కంపెనీలు వేర్వేరు రేట్లు ప్రకటించడం, టీకాలు వేయడంలో వయోభేదం పాటించడం, వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్న కోటా వేర్వేరుగా ఉండటంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న టీకాల విధానాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న టీకా విధానం రాజ్యాంగబద్ధతను తాము ప్రశ్నించడం లేదంటూనే, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండేలా సమీక్షించాలని సూచించింది సుప్రీం. కరోనా […]

జాతీయ టీకా విధానం ప్రకటించాల్సిందే -సుప్రీంకోర్టు
X

భారత్ లో ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ అమలు తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకా కంపెనీలు వేర్వేరు రేట్లు ప్రకటించడం, టీకాలు వేయడంలో వయోభేదం పాటించడం, వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్న కోటా వేర్వేరుగా ఉండటంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న టీకాల విధానాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న టీకా విధానం రాజ్యాంగబద్ధతను తాము ప్రశ్నించడం లేదంటూనే, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండేలా సమీక్షించాలని సూచించింది సుప్రీం.

కరోనా నివారణకు సంబంధించి 64 పేజీల ఆదేశాలు ఇచ్చిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ లతో కూడిన ధర్మాసనం, టీకాల పంపిణీలో అసమానతలు తొలగించాలని కేంద్రానికి పలు సూచనలు చేసింది. టీకా విధానంపై జరిపిన ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ప్రజారోగ్య హక్కుకు భంగం కలుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది ధర్మాసనం.

“తయారీదార్లు టీకాలకు రెండు రకాల ధరలు సూచించారు. కేంద్రానికి తక్కువ ధరకు, రాష్ట్రాలకు ఎక్కువ ధరలకు ఇస్తున్నారు. దీనివల్ల 18-44 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలే వీరికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వయోవర్గానికి చెందిన పేదలకు మరీ కష్టంగా ఉంటుంది. చాలా మందికి కొనే స్థోమత లేదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులబట్టి టీకాలు ఉచితంగా ఇస్తారా? తక్కువ ధరకు సరఫరా చేస్తారా? అన్నది ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే దేశవ్యాప్త టీకా విధానంలో అసమానతలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రజల మధ్య వివక్ష చూపినట్టు అవుతుంది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు (21వ అధికరణం)కు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తోంది.” అని ధర్మాసనం పేర్కొంది.

ఆక్సిజన్, అంబులెన్స్ సేవలపై సమగ్ర విధానం అవసరం..
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై సమగ్ర విధానం అమలు చేయాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. మందులు, ఆక్సిజన్‌ ను అక్రమంగా నిల్వచేసి, అధిక ధరలకు అమ్ముతున్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. నకిలీ మందులు విక్రయించేవారిపై కేసులు పెట్టాలని తెలిపింది.

అంబులెన్స్‌ సేవలకు విపరీతమైన ఛార్జీలు వసూలు చేయకుండా ఒక విధానాన్ని రూపొందించాలని కూడా సూచించింది సుప్రీంకోర్టు. ఫిర్యాదులు స్వీకరించి ఎప్పటికప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దోచుకోవడం దారుణమని తెలిపింది సుప్రీంకోర్టు.

First Published:  4 May 2021 3:55 AM IST
Next Story