నందిగ్రామ్ కౌంటింగ్ లో కుట్ర.. మమత సంచలన వ్యాఖ్యలు..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ నందిగ్రామ్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నందిగ్రామ్ ఓటర్ల తీర్పుని స్వాగతిస్తున్నానని చెప్పిన మమత, కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని మరోసారి ధ్వజమెత్తారు. నందిగ్రామ్ లో కౌంటింగ్ మొదలైనప్పటినుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏడో రౌండ్ తర్వాత మెజార్టీలు మారి చివరకు మమత 1200 ఓట్ల మెజార్టీతో గెలిచారనే ప్రచారం జరిగింది. అయితే […]
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ నందిగ్రామ్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నందిగ్రామ్ ఓటర్ల తీర్పుని స్వాగతిస్తున్నానని చెప్పిన మమత, కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని మరోసారి ధ్వజమెత్తారు. నందిగ్రామ్ లో కౌంటింగ్ మొదలైనప్పటినుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏడో రౌండ్ తర్వాత మెజార్టీలు మారి చివరకు మమత 1200 ఓట్ల మెజార్టీతో గెలిచారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వెంటనే సువేందు అధికారి గెలిచారని అధికారిక ప్రకటన విడుదలైంది. దీంతో మమతా బెనర్జీ అక్కడ రీకౌంటింగ్ కి డిమాండ్ చేశారు, ఫలితాన్ని ప్రకటించొద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయినా కూడా తుది ఫలితాన్ని ఈసీ వెల్లడించింది. సువేందుని విజేతగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ న్యాయపోరాటానికి సిద్ధమని చెప్పారు.
ఫలితాల తర్వాతి రోజు కూడా మమతా బెనర్జీ నందిగ్రామ్ కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు 4గంటల పాటు సర్వర్ లో సమస్య ఉందని ఈసీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను గెలిచినట్టు తెలిసి గవర్నర్ కూడా అభినందనలు తెలిపారని దీదీ చెప్పారు. రీకౌంటింగ్ కు తాము డిమాండ్ చేసినా, అనుమతి ఇవ్వొద్దని రిటర్నింగ్ ఆఫీసర్ ను కొందరు బెదిరించారని చెప్పారు. రీకౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్వో అన్నట్లు తనకు తెలిసిందని అన్నారు మమత. ఈమేరకు ఆర్వో రాసిన లేఖ ఒకటి తన వద్ద ఉందని చెప్పారు దీదీ.
ప్రత్యామ్నాయం ఏంటి..?
న్యాయపోరాటం చేస్తానని మమతా బెనర్జీ చెబుతున్నా.. ఆమెకు మరో మూడు ఆప్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాల్ లో శాసన మండలి లేదు కాబట్టి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపు ఆమె కచ్చితంగా శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీకి ప్రస్తుతం 292 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఆర్ఎస్పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్ స్థానానికి, కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడంతో శంషేర్ గంజ్ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఖర్దాహా అనే నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ గెలుపొందిన కాజల్ సిన్హా కొవిడ్ కారణంగా పోలింగ్ కి ముందే మరణించారు. అయితే సాంకేతికంగా అక్కడ ఎన్నికలు ఆగిపోలేదు కాబట్టి, కాజల్ సిన్హాని విజేతగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ మూడు స్థానాల్లో ఎక్కడో ఓ చోట మమతా బెనర్జీ పోటీ చేస్తారని అంటున్నారు.