నిన్న ఢిల్లీ.. నేడు కర్నాటక.. ఆక్సిజన్ అందక రోగులు బలి..
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్న వరుస ఘటనలు కలవరపెడుతున్న నేపథ్యంలో తాజాగా కర్నాటకలో జరిగిన ఉదంతం ఏకంగా 24మందిని బలితీసుకుంది. చామ రాజనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 24గంటల వ్యవధిలో ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నవారు 24మంది ప్రాణాలు వదిలారు. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతోనే వీరంతా మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే చనిపోయిన పేషెంట్లు మొత్తం వెంటిలేటర్లపై ఉన్నవారేనని.. వారికి ఇతర ఆరోగ్య సమస్యలు […]
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు పిట్టల్లా రాలిపోతున్న వరుస ఘటనలు కలవరపెడుతున్న నేపథ్యంలో తాజాగా కర్నాటకలో జరిగిన ఉదంతం ఏకంగా 24మందిని బలితీసుకుంది. చామ రాజనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 24గంటల వ్యవధిలో ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నవారు 24మంది ప్రాణాలు వదిలారు. ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడంతోనే వీరంతా మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే చనిపోయిన పేషెంట్లు మొత్తం వెంటిలేటర్లపై ఉన్నవారేనని.. వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామ రాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి చెబుతున్నారు. కేవలం ఆక్సిజన్ కొరత వల్లే మరణించారని చెప్పలేమని ఆయన అన్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. చామ రాజనగర్ జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రేపు అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు.
మరోవైపు ఢిల్లీలోని కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారు. ఏప్రిల్ లో ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20మంది రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆక్సిజన్ నిల్వలు అడుగంటినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రాణవాయువు సరఫరా పునరుద్ధరించే లోపే రోగులు చనిపోయారని యాజమాన్యం తెలిపింది. ఢిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్ గంగారామ్ లో కూడా ఆక్సిజన్ సరిపడా లేక ఒకేరోజు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక, డాక్టర్ సహా 8మంది రోగులు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.
ఆక్సిజన్ నిల్వలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ఢిల్లీ సర్కారు ఆర్మీ సాయం కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నగరంలో కోవిడ్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న వేళ.. ప్రత్యేక కోవిడ్ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. ఇదే విషయమై ఢిల్లీ హైకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఢిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.