భారత్ లో మూడోదశ లాంఛనం మొదలు..
వ్యాక్సినేషన్ తోనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మూడో దశ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, రెండో దశలో వృద్ధులు, 45ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇచ్చిన ప్రభుత్వం మూడో దశలో 18ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకా వేయాలని సంకల్పించింది. అయితే టీకాల లభ్యత లేకపోవడంతో దీనిపై వెనకడుగు వేసినట్టు కనిపించినా చివరకు మే 1న లాంఛనంగా టీకా కార్యక్రమాన్ని మొదలు […]
వ్యాక్సినేషన్ తోనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మూడో దశ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, రెండో దశలో వృద్ధులు, 45ఏళ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇచ్చిన ప్రభుత్వం మూడో దశలో 18ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకా వేయాలని సంకల్పించింది. అయితే టీకాల లభ్యత లేకపోవడంతో దీనిపై వెనకడుగు వేసినట్టు కనిపించినా చివరకు మే 1న లాంఛనంగా టీకా కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మూడోదశ టీకాకు సంబంధించి తొలిరోజు మే-1న 18-44 ఏళ్ల వారిలో 84,599 మందికి తొలి డోసు టీకా అందించినట్లు కేంద్రం తెలిపింది.
రెండోదశ వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా మూడో దశలో యువతకు టీకాలు ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు ముందుకు రాలేదు. టీకా కొరత కారణంగా కొన్ని రాష్ట్రాలలో రెండు రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. ఈ దశలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జమ్మూ-కశ్మీర్, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 ఏళ్ల వారికి టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. కర్నాటక, ఒడిశా రాష్ట్రాలు లాంఛనంగా మాత్రమే యువతకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టాయి. టీకాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచడంలో కేంద్ర సంస్థలు విఫలమయ్యాయని మండిపడ్డ జార్ఖండ్ ప్రభుత్వం, టీకాలు అందాక మూడో దశకు సంబంధించి కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.
ఉత్తర ప్రదేశ్ లో లక్నో, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, వారణాసి, గోరఖ్ పూర్, మీరట్, బరేలీల్లో మూడో దశ టీకాల కార్యక్రమం మొదలైంది. ఛత్తీస్ గఢ్ లోని 16 జిల్లాల పరిధిలో 1,693 మందికి (18-44 వయసు వారికి) టీకాలు వేశారు. ఒడిశాలో లాంఛనంగా వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. సోమవారం నుంచి అక్కడ మూడో దశ పూర్తి స్థాయిలో మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కూడా యువతకు మే-1న టీకాలు వేయగా.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు అధికారులు. తమ వద్ద టీకా నిల్వలు లేనందున తదుపరి టీకా తేదీని ప్రకటిస్తామని కేరళ తెలిపింది. 18-44 వయసు వారికి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
మూడో దశ రద్దీని తట్టుకునే సంఖ్యలో తమ దగ్గర టీకా నిల్వలు లేవని తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఈపాటికే ప్రకటించాయి. మరోవైపు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద టీకా డోసులు 79 లక్షలకుపైగా అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.