Telugu Global
NEWS

ఈటలకు ఉద్వాసన.. మంత్రి పదవి తొలగింపు..

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈటల రాజేందర్ ఇప్పటి వరకు నిర్వహించిన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. ఈటలపై వేటు అనే మాట రాకుండా సున్నితంగా ఈ కార్యక్రమం ముగిసింది. ఆరోపణలపై విచారణ ముమ్మరం.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని భూముల కబ్జా వ్యవహారంలో […]

ఈటలకు ఉద్వాసన.. మంత్రి పదవి తొలగింపు..
X

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఈటల రాజేందర్ ఇప్పటి వరకు నిర్వహించిన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేశారు. ఈటలపై వేటు అనే మాట రాకుండా సున్నితంగా ఈ కార్యక్రమం ముగిసింది.

ఆరోపణలపై విచారణ ముమ్మరం..
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని భూముల కబ్జా వ్యవహారంలో ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై వెను వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత ఈటల మీడియా సమావేశంలో తన నిర్దోషిత్వాన్ని ఏకరువు పెడుతూ ప్రత్యారోపణలు ఎక్కుపెట్టడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈటలను బలిపశువుని చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆయనపై సింపతీ కురిపిస్తూనే.. కేసీఆర్ అవినీతి పాలనపై కూడా విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఇటు ఈటలపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు నేరుగా పొలాల వద్దకు వెళ్లి విచారణ మొదలు పెట్టారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్ విజిలెన్స్ విచారణను పరిశీలించారు.

మాసాయిపేట తహశీల్దార్‌ కార్యాలయంలో భూముల రికార్డులు పరిశీలించారు. ఈటల అధీనంలో ఉన్న భూమిలో.. అసైన్డ్‌ భూమి కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక సమర్పిస్తామని మెదక్ కలెక్టర్ చెప్పారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్‌ ఆధ్వర్యంలో కూడా భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వే చేస్తున్నాయి. ఈటలకు చెందిన హేచరీస్‌ లలో కూడా డిజిటల్‌ సర్వే కొనసాగుతోంది.

అటు ఈటల వర్గం కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. శామీర్‌ పేట్‌ లోని మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. వారంతా ఈటలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉండిపోతున్నారు. మంత్రి పదవి తొలగింపు తర్వాత ఈటల నివాసం వద్ద సందడి భారీగా పెరిగింది.

First Published:  1 May 2021 4:37 AM GMT
Next Story