ఈటల కేంద్రంగా సింపతీ రాజకీయం..
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగా సింపతీ రాజకీయం మొదలైంది. కేసీఆర్ ని టార్గెట్ చేసే వారంతా.. ఈటలకు మద్దతు తెలుపుతూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈటలను బలిపశువుని చేశారని మండిపడుతూనే కేసీఆర్ మంత్రి వర్గంలో అందరూ సుద్దపూసలేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నందుకే ఈటల గొంతు నొక్కేస్తున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ మద్దతు.. నేరుగా ఈటలకు మద్దతు తెలపకపోయినా.. ఆయనను బలిపశువుని చేశారంటూ కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ […]
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగా సింపతీ రాజకీయం మొదలైంది. కేసీఆర్ ని టార్గెట్ చేసే వారంతా.. ఈటలకు మద్దతు తెలుపుతూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈటలను బలిపశువుని చేశారని మండిపడుతూనే కేసీఆర్ మంత్రి వర్గంలో అందరూ సుద్దపూసలేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నందుకే ఈటల గొంతు నొక్కేస్తున్నారని విమర్శిస్తున్నారు.
బీజేపీ మద్దతు..
నేరుగా ఈటలకు మద్దతు తెలపకపోయినా.. ఆయనను బలిపశువుని చేశారంటూ కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలందరి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్ సహా చాలామందిపై అవినీతి ఆరోపణలు వచ్చినా కేసీఆర్ ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సీఎం వ్యతిరేక వర్గం కావడం వల్లే ఈటలపై హడావిడిగా విచారణ మొదలైందని అన్నారు సంజయ్. కరోనాతో తెలంగాణ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నాకనీసం స్పందించే స్థితిలో కూడా టీఆర్ఎస్ సర్కారు లేదని విమర్శించారు.
కరోనా కల్లోలంలో ప్రజలు.. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్లు, డాక్టర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఈటలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్‌ఎస్ నేతలందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఈటల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందనే అక్కసుతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం? జూపల్లికో న్యాయమా అంటూ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ బాసట..
మంత్రి ఈటల రాజేందర్ కబ్జాలకు పాల్పడితే తప్పకుండా శిక్షించాలని, కానీ అంతకంటే ముందు టీఆర్‌ఎస్ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఈటలను బలిపశువుని చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈటలను తప్పించాలనేది కేసీఆర్ పన్నాగమని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్ లపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు శ్రవణ్.
కేసీఆర్ వ్యతిరేక ఉద్యమం నిర్మిద్దాం..
సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించడానికి సిద్ధమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈటలతో పాటు కేటీఆర్, మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్ రెడ్డిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈటల గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై విచారణ జరుగుతోందని, ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి భూ వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. హఫీజ్ పేట్, మియాపూర్ భూములపై కూడా విచారణ జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. కరోనా నుంచి దృష్టి మరల్చడానికే ఈటల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
ప్రణాళిక ప్రకారమే నాపై దాడి..
అటు ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవి తప్పించడంపై స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకే ఆ శాఖను తన నుంచి తప్పించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుందని.. ఏ మంత్రినైనా తొలగించే అధికారం కూడా ఆయనకు ఉంటుందని అన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుంటానని ఈటల స్పష్టం చేశారు. ఓ ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఈటల ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రజలే అసహ్యించుకుంటున్నారని.. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. సీఎం కేసీఆర్ తో ఇప్పటివరకు మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. ఇకపై చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, అభిమానులతో చర్చించిన తర్వాతే మాట్లాడతానని వెల్లడించారు.