Telugu Global
National

18 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్పటికి సాధ్యం..?

భారత్ లో వ్యాక్సినేషన్ మొదటి దశలో.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే టీకాలు వేశారు. ఆ తర్వాత 60ఏళ్ల పైబడినవారికి, 45ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అవకాశమిచ్చారు. డిమాండ్ సరిగా లేకపోవడంతో కొన్ని చోట్ల నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించకుండానే అన్ని వయసుల వారికీ వ్యాక్సినేషన్ వేశారు. అయితే సెకండ్ వేవ్ తో వ్యాక్సిన్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ దశలో వ్యాక్సినేషన్ పూర్తయితేనే […]

18 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్పటికి సాధ్యం..?
X

భారత్ లో వ్యాక్సినేషన్ మొదటి దశలో.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే టీకాలు వేశారు. ఆ తర్వాత 60ఏళ్ల పైబడినవారికి, 45ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి అవకాశమిచ్చారు. డిమాండ్ సరిగా లేకపోవడంతో కొన్ని చోట్ల నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించకుండానే అన్ని వయసుల వారికీ వ్యాక్సినేషన్ వేశారు. అయితే సెకండ్ వేవ్ తో వ్యాక్సిన్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.

ఈ దశలో వ్యాక్సినేషన్ పూర్తయితేనే కోవిడ్ వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేయడం, మే 1నుంచి 18 సంవత్సరాలు పైబడనవారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే భారత్ లో 18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా కనిపించడంలేదు.

18ఏళ్లు పైబడినవారంతా వ్యాక్సిన్ వేయించుకోడానికి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని కేంద్రం ప్రకటించడంతో ఈనెల 28నుంచి దాదాపుగా 2.4 కోట్లమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అంచనా. వీరందరికీ టీకా అందించడం మే 1 నుంచి సాధ్యం అవుతుందా లేదా అనేది మాత్రం పూర్తి అనుమానంగా మారింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ వయసుల వారికి 15.22 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 67శాతం డోసులు అందించామని కేంద్రం పేర్కొంది.

అయితే ఢిల్లీ లాంటి రాష్ట్రాలు మే 1నుంచి 18ఏళ్ల పైబడినవారికి వ్యాక్సిన్ అందించలేమని ముందే చేతులెత్తేశాయి. ఫార్మా సంస్థల నుంచి టీకాలు అందలేదని, అవి రాగానే వ్యాక్సినేషన్‌ మొదలుపెడతామని, గుజరాత్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసే ప్రక్రియ ఆలస్యం అవుతుందని పంజాబ్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ కూడా ప్రకటించారు. కనీసం పదిలక్షల డోస్‌ లు నిల్వ ఉంటే మే 1న వ్యాక్సినేషన్‌ మొదలు పెట్టవచ్చని, కానీ తమ వద్ద అన్ని టీకాలు లేవని ఆయన చెబుతున్నారు. 30 లక్షల కోవిషీల్డ్‌ టీకాల కోసం సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ కు ఆర్డర్‌ ఇచ్చామని అన్నారు బల్బీర్ సింగ్. అటు యూపీ కూడా గ్లోబల్ టెండర్లు పిలిచి వ్యాక్సిన్లకోసం ఎదురు చూస్తోంది. సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ లకు చెరో 50 లక్షల డోస్‌ల కోసం యూపీ ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఇటు ఏపీ కూడా 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడింది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది జనవరి చివరికి సాధ్యమవుతుందని ప్రకటించారు ఏపీ సీఎం జగన్. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 45ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే ఆగస్ట్, సెప్టెంబర్ వరకు సమయం పడుతుందని, ఆ తర్వాతే 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ సాధ్యపడుతుందని చెప్పారు జగన్. భారత్ లో 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలంటే 120కోట్ల డోసులు కావాల్సి ఉంటుంది, ప్రస్తుతానికి భారత్ బయోటెక్ నెలకి కోటి డోసులు, సీరం ఇన్ స్టిట్యూట్ నెలకి 6కోట్ల డోసులే ఉత్పత్తి చేస్తున్నాయని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మే 1నుంచి 18ఏళ్లు పైబడివవారికి వ్యాక్సిన్ వేసేందుకు ఏపీ కూడా సిద్ధంగా లేదనే విషయం స్పష్టమవుతోంది. మొత్తమ్మీద.. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించినా, యువత హడావిడిగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. మే 1నుంచి మాత్రం 18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.

First Published:  30 April 2021 11:14 AM IST
Next Story