కోర్టుకి చేరిన పరీక్షల పంచాయితీ..
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం హైకోర్టుకి చేరింది. మే 5నుంచి ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న తరుణంలో అటు ప్రతిపక్షాలు, ఇటు కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. విజయవాడకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి, ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, వారి తరపున తల్లిదండ్రులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ […]
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం హైకోర్టుకి చేరింది. మే 5నుంచి ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న తరుణంలో అటు ప్రతిపక్షాలు, ఇటు కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. విజయవాడకు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి, ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, వారి తరపున తల్లిదండ్రులు పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.
శానిటైజేషన్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు వహించినా.. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కరోనా భయాలు తొలగిపోలేదని ఆయా పిటిషన్లలో పేర్కొన్నారు. ఏపీలో 6.3 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు జూన్ లో పరీక్షలు రాయాల్సి ఉంది. మే 5నుంచి మొదలు కావాల్సిన ఇంటర్ పరీక్షలకు దాదాపుగా 10.6 లక్షలమంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని పిటిషనర్లు కోర్టుకి గుర్తుచేశారు. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని, తమ అనుమానాలను పరిగణలోకి తీసుకుని ఏపీలో కూడా పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని వారు కోరారు.
మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం హడావిడిగా పరీక్షలు నిర్వహించకుండా కొంత సమయం వేచి చూడాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అటు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ఏపీలో పరీక్షల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పరీక్షలు రద్దుచేయడమో లేక, వాయిదా వేయడమో చేయాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. అటు పరీక్షల నిర్వహణ అడ్డుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ గవర్నర్ కు నారా లోకేష్, సోము వీర్రాజు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద.. ఏపీలో పరీక్షల వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్లడం గమనార్హం.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరం..
మే 5నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశామని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని, కొన్ని చోట్ల వాయిదా మాత్రమే వేశారని ఆయన గుర్తు చేశారు. కొన్ని పార్టీలు ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.