తెలంగాణ సర్కారుకి తలంటిన హైకోర్టు..
నిధులు, నీళ్లు, నియామకాలు.. వీటికోసమే ప్రత్యేక తెలంగాణ అంటూ ప్రజల్లో ఉద్యమ కాంక్ష రగిల్చిన నేతలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఆ మూడు అంశాలపై ఎంతటి ముందడుగు వేశారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిధులు, నీళ్ల విషయం పక్కనపెడితే.. నియామకాల విషయంలో తెలంగాణ యువత తీవ్ర నిరాశలో ఉందనే విషయం మాత్రం వాస్తవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం అని ఊరించిన నేతలు.. ఆదిలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పలేదే అంటూ […]
నిధులు, నీళ్లు, నియామకాలు.. వీటికోసమే ప్రత్యేక తెలంగాణ అంటూ ప్రజల్లో ఉద్యమ కాంక్ష రగిల్చిన నేతలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఆ మూడు అంశాలపై ఎంతటి ముందడుగు వేశారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిధులు, నీళ్ల విషయం పక్కనపెడితే.. నియామకాల విషయంలో తెలంగాణ యువత తీవ్ర నిరాశలో ఉందనే విషయం మాత్రం వాస్తవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం అని ఊరించిన నేతలు.. ఆదిలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పలేదే అంటూ పెదవి విరిచారు. ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్ల జాడే లేదు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో కూడా సరైన కార్యాచరణ లేకపోవడం నిజంగా విడ్డూరం.
టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్ గా గంటా చక్రపాణి నియామకం అట్టహాసంగా జరిగినా.. నిరుద్యోగ నియామకాలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. తెలంగాణలో తొలి గ్రూప్-1, తొలి గ్రూప్-2.. అంటూ ఊరించారే కానీ, భారీ స్థాయిలో నియామక ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో వేసిన మెగా డీఎస్సీ, కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోతూ వేసిన భారీ నోటిఫికేషన్లే ఇంకా నిరుద్యోగులకు గుర్తొస్తుంటాయి. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్, సచివాలయాలు, వాలంటీర్ల పోస్ట్ ల భర్తీతో గత చరిత్రను చెరిపేసి, కొత్త అధ్యాయం మొదలు పెట్టినా, తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో ఉద్యోగాల నియామకాలు జరగలేదు.
ఇటీవల వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్న వేళ, ఉద్యోగాల భర్తీ, నియామకాల ప్రక్రియ మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. ఇద్దరు నిరుద్యోగులు, అందులోనూ యూనివర్శిటీ స్టూడెంట్స్ నెలల వ్యవధిలోనే బలవన్మరణాలకు పాల్పడటంతో తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియామకాలకోసం షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు నిరుద్యోగుల మద్దతు కూడా ప్రముఖంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం మరోసారి తెలంగాణలో వివాదంగా మారింది.
2014లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గంటా చక్రపాణి పదవీకాలం 2020 డిసెంబరుతో ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. సీనియార్టీ ప్రకారం ఇతర సభ్యులు విడతల వారీగా చైర్మన్ పోస్టుల్లో కొలువుదీరుతూ వస్తున్నారు. తాజాగా ఇద్దరే ఇద్దరు సభ్యులు టీఎస్పీఎస్సీలో మిగలడం, వారిలో ఒకరైన కృష్ణారెడ్డి తాత్కాలిక పదవీకాలం కూడా ముగిసిపోవడంతో.. ఏకైక సభ్యుడు సాయిలు కొత్తగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే దీనిపై నిరుద్యోగులు కోర్టుకెక్కారు. జె.శంకర్ అనే నిరుద్యోగి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ సర్కారు వ్యవహారంపై ఘాటుగా స్పందించింది.
నాలుగు వారాల్లో టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన కోర్టు, కుదరకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మూసేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైర్మన్, సభ్యుల నియామకం తర్వాత నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పిల్ పై విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. త్వరలోనే 50 వేల ఉద్యోగాల నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినే నేపథ్యంలో టీఎస్పీఎస్సీలోనే శాశ్వత నియామకాలు లేకపోవడం నిజంగా విడ్డూరం. ఈ నేపథ్యంలో తాత్కాలిక చైర్మన్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కాస్త గట్టిగానే తలంటినట్లయింది.