నిర్లక్ష్యం ఖరీదు.. 3వేలమంది కరోనా రోగులు మిస్సింగ్..
భారత్ లో కరోనా కల్లోలం నాణేనికి రెండో వైపు ఎలా ఉందో చెప్పే పరిస్థితి ఇది. ఓవైపు కరోనా సోకి వైద్యం అందక రోగులు ఆస్పత్రుల ముందు పడిగాపులు పడుతున్న దృశ్యాల్ని చూస్తున్నాం. మరోవైపు కరోనా పాజిటివ్ రాగానే.. పత్తా లేకుండా ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోతున్న రోగుల్ని గమనిస్తున్నాం. అవును, బెంగళూరులో ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు సుమారు 3వేల మంది మాయమైపోయారు. వారి అడ్రస్ లు వెదికి పట్టుకోవడం, వారికి చికిత్స అందించడం, […]
భారత్ లో కరోనా కల్లోలం నాణేనికి రెండో వైపు ఎలా ఉందో చెప్పే పరిస్థితి ఇది. ఓవైపు కరోనా సోకి వైద్యం అందక రోగులు ఆస్పత్రుల ముందు పడిగాపులు పడుతున్న దృశ్యాల్ని చూస్తున్నాం. మరోవైపు కరోనా పాజిటివ్ రాగానే.. పత్తా లేకుండా ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోతున్న రోగుల్ని గమనిస్తున్నాం. అవును, బెంగళూరులో ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు సుమారు 3వేల మంది మాయమైపోయారు. వారి అడ్రస్ లు వెదికి పట్టుకోవడం, వారికి చికిత్స అందించడం, అలాంటి వారినుంచి మరికొందరికి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు అధికారులకు తలకు మించిన భారంలా మారింది.
నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ వార్డుల్లో చేరాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ రావాల్సిందే. నాలుగైదు రోజులయినా ఆ పరీక్ష ఫలితాలు రావు, ఈలోపు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకవు, వెరసి రోగులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. అయితే చివరకు పరీక్ష ఫలితాలు వచ్చే సరికి రోగి కోలుకోవడమో లేక, పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడమో జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ పరీక్ష ఫలితాలు వచ్చే లోపు రోగి పరిస్థితి మెరుగయితే అక్కడినుంచి మరో స్టోరీ మొదలవుతుంది. సదరు రోగి కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు వైద్యుల దగ్గర అనుమతి తీసుకోవాలి. లేకపోతే వైద్య సిబ్బందినుంచి వరుసగా ఫోన్లు మొదలవుతాయి. హోమ్ ఐసోలేషన్ కి అనుమతి ఎవరిచ్చారు, ఇంట్లో ఎందుకున్నారంటూ సవాలక్ష ప్రశ్నలు. దీంతో అసలీ గొడవంతా ఎందుకు అనుకుంటున్న చాలామంది.. ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు వచ్చాక, ఫోన్ స్విచాఫ్ చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చాలామంది సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్క బెంగళూరు నగరంలోనే 3వేలమంది పాజిటివ్ రోగులు మిస్ అయినట్టు అధికారిక సమాచారం.
కర్నాటకలో బుధవారం ఒక్కరోజే 39,047 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 14.39 లక్షలకు పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 22.70 శాతానికి ఎగబాకింది. కర్నాటకలో అత్యథికంగా బెంగళూరులోనే కొవిడ్ బాధితులున్నారు. బెంగళూరులో ఒక్కరోజు వ్యవధిలోనే 22,596 మంది కరోనా బారినపడగా, మొత్తం బాధితుల సంఖ్య 2,24,152 మందికి చేరింది.
బెంగళూరులో విచిత్ర పరిస్థితి ఏంటంటే.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయారు. సుమారు 3వేలమంది అడ్రస్ లేకుండా పోయారని అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాంటి వారంతా చికిత్స తీసుకుంటున్నారో లేదో తెలియదు, ఎక్కడున్నారో, ఎంతమందికి వైరస్ అంటించారో తెలియదు. ఇలాంటి వారి వల్లే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని కర్నాటక రెవెన్యూమంత్రి అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆచూకీ కనిపెడతామని చెప్పారు.
మరోవైపు కర్నాటకలో లాక్ డౌన్ ప్రభావం సత్ఫలితాలనిస్తోందని చెబుతున్నారు అధికారులు. ఉదయం 6నుంచి 10గంటల వరకే అక్కడ నిత్యావసరాలకు అనుమతిస్తున్నారు. మిగతా సమయం అంతా గ్రామాలు, నగరాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉంటున్నాయి. మొత్తమ్మీద బెంగళూరులో మిస్ అయిన కరోనా రోగుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.