Telugu Global
NEWS

‘పోలవరం’ అవినీతి అసలు నిజాలివే?

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా విషం చిమ్ముతోంది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు కూడా అందుకనుగుణంగానే మాట్లాడుతున్నారు. ఓ పథకం ప్రకారం పోలవరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు గ్రాఫిక్స్​ ప్రపంచాన్ని చూపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్​ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తుండటంతో ఓర్చుకోలేక ఆరోపణలు చేస్తున్నారని […]

‘పోలవరం’ అవినీతి అసలు నిజాలివే?
X

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా విషం చిమ్ముతోంది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. టీడీపీ నేతలు కూడా అందుకనుగుణంగానే మాట్లాడుతున్నారు. ఓ పథకం ప్రకారం పోలవరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు గ్రాఫిక్స్​ ప్రపంచాన్ని చూపించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం సీఎం జగన్​ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తుండటంతో ఓర్చుకోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పోలవరం కాంట్రాక్టర్​కు లబ్ధి చేకూర్చేందుకు ప్రాజెక్టు అంచనాలను అమాంతం పెంచారని టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా గత వారం రోజులుగా కథనాలను ప్రచురిస్తున్నది. అయితే ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచి .. సదరు కాంట్రాక్టర్​కు లబ్ధి చేకూర్చార‌న్న‌ది టీడీపీ, ఓ వర్గం మీడియా ప్రధాన ఆరోపణ. అయితే నిజానికి ఈ ప్రాజెక్టు అంచనా పెంచాలన్నా, సవరించాలన్న కేంద్ర జలసంఘం ఆమోదం తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు మొత్తం కేంద్ర జలసంఘం ఆధీనంలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పనులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. ఒకవేళ కాంట్రాక్టర్​కు లబ్ధి చేకూర్చడం కోసమే అంచనాలు పెంచాల్సి వస్తే.. కేంద్ర జలసంఘం ఎందుకు ఒప్పుకుంటుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. ఈ వర్షాలతో పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, మట్టి కట్టలు విపరీతంగా కోతకు గురయ్యాయి. గత ప్రభుత్వం ఇంజినీర్ల సూచనలకు విరుద్ధంగా పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో వీటిని పటిష్ఠంగా నిర్మించాలని ప్రభుత్వం భావించింది.

50 లక్షల క్యుసెక్కుల వరద వచ్చినా జలాశయం తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరచూ కేంద్ర జలసంఘం మార్పులు చేస్తోంది. దీంతో అంచనాలు పెరిగాయి. కొత్త డిజైన్​ ప్రకారం ఒక్క అప్రోచ్ ఛానెల్ లోనే దాదాపు కోటి ఇరవై లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తోంది. దీంతో సహజంగానే అంచనాలు పెరిగాయి.గత ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో డబ్బులు డ్రా చేసుకొని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది తప్ప.. పనులు పూర్తి చేయలేదు. దీంతో పనులు మొత్తం పెండింగ్​లో పడిపోయాయి.

ఇప్పుడు పెంచింది ఎంత?

పొలవరం ప్రాజెక్టుకు ప్రస్తుతం రూ. 1656 కోట్లు మాత్రమే పెంచారు. అది కూడా కేంద్ర జలసంఘం ఆమోదంతోనే. అయితే గతంలో అంటే 2016లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ. 1500 కోట్లు అంచనా వ్యయం పెంచారు. అప్పుడు ఈ పచ్చమీడియా కనీసం ఒక్క కథనం కూడా రాయలేదు. ఇప్పుడు మాత్రం గగ్గోలు పెడతుందన్న విమర్శలు వస్తున్నాయి. 2016 లో ప్రాజెక్ట్ (హెడ్ వర్స్క్) అంచనా వ్యయాన్ని రూ.4054 కోట్ల నుంచి రూ.5535 కోట్లకు పెంచారు. అంటే 1481 కోట్ల రూపాయలు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2013లో అప్పటి సంస్థ రూ.4054 కోట్లకు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2015-16 సవరించిన అంచనాల ప్రకారం అంచనా వ్యయం పెంచాలని అప్పటి నిర్మాణ సంస్థ కోరడంతో ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

స్పిల్ ఛానెల్ ఎండ్ కటాఫ్ డయా ఫ్రంవాల్

స్పిల్ ఛానెల్ చివరన 12 మీటర్ల లోతు నుండి 1354 మీటర్ల పొడవున కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు. స్పిల్ ఛానెల్లో నిర్మించే కాంక్రీట్ బ్లాకులు, మట్టి స్పిల్ వే నుంచి వచ్చే భారీ వరద ప్రవాహాన్ని కొట్టుకుపోకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ స్పిల్ వే నుంచి విడుదల చేసే భారీ వరద ప్రవాహ వేగానికి కాంక్రీట్ బ్లాకులు, మట్టి కొట్టుకుపోయినా ఈ డయా ఫ్రం వాల్ అడ్డుకుంటుంది. దీనిని రూ. 83.17కోట్లతో నిర్మించనున్నారు.

గ్యాప్-2లో నేలను గట్టిపరిచే పనులు

ప్రాజెక్టులో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం అతి కీలకమైనది. దీన్ని నిర్మించాలంటే ముందుగా నదీ గర్భంలోని ఇసుకను దాదాపు 100 అడుగుల లోతు నుంచి గట్టిపరచుకుంటూ నేలను రాయిలాగా మార్చాలి.
దీనినే వైబ్రోకాంపాక్షన్ అంటారు. ఇలా నేలను గట్టి పరుస్తూ ఆ గ్యాప్ లో ఇసుక ను నింపుతారు. మారిన డిజైన్ల ప్రకారం ఇసుకతో పాటు కంకరను నింపాల్సి వస్తోంది. దీనినే స్టోన్ కాలమ్స్ గా పిలుస్తారు.

భూమిని లోతు నుంచి గట్టిపరచుకుంటూ చేసే పనులనే డీప్ సాయిల్ మిక్సింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల భూమిలోపల ఖాళీ ప్రదేశం లేకుండా రాయిలాగా గట్టిగా మారుతుంది. దీనిపైనే ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మిస్తారు. ఇలా చేయడం వల్ల ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కట్టిన తరువాత బొట్టు నీరు కూడా నదీగర్భంలో నుంచి దిగువకు లీకు అవ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పటిష్టతకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పనులకు కేంద్రజలసంఘం సూచనల మేరకు రూ. 211.12కోట్లతో కొత్తగా టెండర్ పిలిచారు.

గ్యాప్-1,మరియు గ్యాప్-3 లలో డ్యాంల నిర్మాణం

పోలవరం హెడ్ వర్క్స్ పనులను రివర్స్ టెండరింగ్ లో మేఘా ఇంజినీరింగ్​ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలని ఉంది.
కానీ కేంద్రజలసంఘం నిపుణుల 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించారు. దీంతో భూమిలోపల నుంచి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది. వీటికి రూ. 242.87 కోట్లతో అదనంగా ఖర్చవుతున్నాయి. దీంతో వీటికి టెండర్లు పిలిచారు.ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం, స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనుల వల్ల నీరు లీక్ కాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇక గ్యాప్-3లో కూడా ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం రూ.11.64 కోట్లతో టెండర్లు పిలిచారు.

స్పిల్ వే కుడి, ఎడమ కొండలకు రక్షణ చర్యలు

స్పిల్ వే బ్రిడ్జికి కుడి, ఎడమ పక్కన కొండలు ఉన్నాయి. వర్షాలకు ఈ కొండచరియలు పడిపోకుండా ఉండటానికి పటిష్ఠ నిర్మాణాలు చేపట్టాలని నిపుణులు సూచించారు. దీంతో రూ. 134.21 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులన్నీ కూడా హెడ్ వర్క్స్ లో భాగంగా కేంద్ర జలసంఘం ఇటీవల అదనంగా సూచించడంతో అదనంగా 683 కోట్ల రూపాయల ఖర్చుఅవుతుందని అంచనాతో ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.

ప్రస్తుతం సీఎం జగన్​ మోహన్​రెడ్డి పోలవరం ప్రాజెక్టును ఎంతో పటిష్ఠంగా, భవిష్యత్​ తరాలకు ఉపయోగపడేలా నిర్మిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్​ అంతా సీఎం జగన్​ ఖాతాలోకి వెళ్తుందని.. దీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా ఆరోపణలు చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు.

First Published:  27 April 2021 6:41 AM IST
Next Story