రెండేళ్లల్లో అధికారంలోకి రాబోతున్నాం..!
రెండేళ్లలో తాను పెట్టబోయే పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఆమె నిరాహార దీక్షను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 15న ఆమె హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దీక్షను ప్రారంభించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆమె లోటస్పాండ్లో దీక్షను కొనసాగిస్తున్నారు. 72 గంటల దీక్ష ఇవాళ ముగియడంతో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు ఆమెకు నిమ్మరసం […]
రెండేళ్లలో తాను పెట్టబోయే పార్టీ అధికారంలోకి వస్తుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఆమె నిరాహార దీక్షను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 15న ఆమె హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద దీక్షను ప్రారంభించారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు భగ్నం చేశారు.
ఆ తర్వాత ఆమె లోటస్పాండ్లో దీక్షను కొనసాగిస్తున్నారు. 72 గంటల దీక్ష ఇవాళ ముగియడంతో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని.. ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తమపై పోలీసులు పాశవికంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. డీజీపీ కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదని ఆరోపణలు చేశారు.
ఇటీవల షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగసభలోనే ఆమె పార్టీపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుచేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. అనంతరం తెలంగాణలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ షర్మిల 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. పార్టీ పెట్టబోయే ముందే షర్మిల ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాఉద్యమాలు నిర్మిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష స్థలికి బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య తదితరులు వచ్చి ఆమె దీక్షకు మద్దతు తెలిపారు. అయితే వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఎవరికి నష్టం? అన్న విషయంపై అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క ప్రజాపోరాటాన్ని కూడా చిత్తశుద్ధితో నిర్వహించలేదు. వైఎస్ షర్మిల మాత్రం పార్టీ పెట్టక ముందే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో వివిధ పార్టీల్లోని ఆశావహులు ఆమె వైపు చూస్తున్నారు. త్వరలోనే షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ పాదయాత్రకు స్పందన లభిస్తే ఆమెకు మరింత మద్దతు దక్కే అవకాశం ఉంది. వివిధ పార్టీల్లోని అసంతృప్తులు, కీలక నేతలు ఆమె వెంట నడిచే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గం, దళితులు అండగా నిలబడుతున్నారు. వారంతా ప్రస్తుతం షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.