శ్రీరామ నవమి రోజున ఆధారాలు..
హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంటూ ఉగాది రోజున ఆధారాలు బయటపెట్టడంతో పాటు ఓ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని ప్రకటించిన టీటీడీ, ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసింది. శ్రీరామ నవమి రోజున హనుమంతుడి జన్మస్థల రహస్యాన్ని బయటపెడతామని, తిరుమలే ఆయన జన్మస్థానం అనేందుకు ఆధారాలు వెలుగులోకి తెస్తామని చెప్పారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇంతకీ ఆంజనేయుడి జన్మస్థలం ఏది..? – కర్నాటకలోని హంపి వద్ద ఆంజనేయ హిల్స్ ఆంజనేయుడి జన్మస్థలం అంటూ ఓ కథనం ప్రచారంలో […]
హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంటూ ఉగాది రోజున ఆధారాలు బయటపెట్టడంతో పాటు ఓ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామని ప్రకటించిన టీటీడీ, ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసింది. శ్రీరామ నవమి రోజున హనుమంతుడి జన్మస్థల రహస్యాన్ని బయటపెడతామని, తిరుమలే ఆయన జన్మస్థానం అనేందుకు ఆధారాలు వెలుగులోకి తెస్తామని చెప్పారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.
ఇంతకీ ఆంజనేయుడి జన్మస్థలం ఏది..?
– కర్నాటకలోని హంపి వద్ద ఆంజనేయ హిల్స్ ఆంజనేయుడి జన్మస్థలం అంటూ ఓ కథనం ప్రచారంలో ఉంది.
– అదే కర్నాటకలోని కిష్కింధ ప్రాంతానికి కూడా ఆంజనేయుడి జన్మస్థలంగా ప్రాచుర్యం ఉంది అక్కడే శ్రీరాముడిని ఆంజనేయుడు కలిశాడని, కిష్కింధే ఆంజనేయుడి పుట్టిన ప్రాంతం అని చెబుతారు.
– జార్ఖండ్ లోని గుల్మా ప్రాంతానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజన అనే గ్రామం ఆంజనేయుడి జన్మస్థలంగా మరో కథనం చెబుతోంది.
– గుజరాత్ దండకారణ్యంలోని డాంగ్ జిల్లాలో అంజని గుహలో హనుమంతుడు జన్మించాడని గిరిజనుల నమ్మకం. ఏటా అక్కడ హనుమజ్జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
– హర్యాణాలోని కైతల్ ప్రాంతానికి కూడా ఆంజనేయ జన్మస్థలంగా పేరుంది.
– మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరి త్రయంబకేశ్వరం సమీపంలో ఉన్న ఆంజనేరి కొండ అంజనీ సుతుడి జన్మస్థలం అని చెబుతారు. అక్కడ ఉన్న అంజనా దేవి ఆలయాన్ని దీనికి రుజువుగా చూపిస్తారు.
ఈ లిస్ట్ లో తిరుమల గిరులలోని జాపాలి ఎప్పటినుంచో ఉంది. అయితే దీనికిప్పుడు సాంకేతిక ఆధారాలంటూ కొత్త భాష్యం చెప్పేందుకు ప్రయత్నిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. గతేడాది డిసెంబర్లో ఆంజనేయుడి జన్మస్థల నిర్థారణకు వేసిన పండితుల కమిటీ నివేదిక తయారు చేసింది. శ్రీరామ నవమి రోజున ఈ నివేదిక బయటపెడతారు. తిరుమల గిరులలోనే అంజనీదేవి పుత్ర సంతానం కోసం తపమాచరించిందని, ప్రతి నిత్యం ఆకాశగంగలో స్నానమాచరించి కొండపై తపస్సు చేసేదని, వాయుదేవుడి వరంతో ఆంజనేయుడు జన్మించారని చెబుతున్నారు టీటీడీ పండితులు. అందుకే త్రేతాయుగంలో అంజనాద్రికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణాలను ఆధారాలుగా చూపెడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి దేవస్థానంతోపాటు.. తిరుమల గిరులపై మొత్తం 17చోట్ల అంజనీసుతుడి ఆలయాలు ఉండటాన్ని కూడా మరో ఉదాహరణగా చూపుతున్నారు. టీటీడీ వేసిన కమిటీ ఆంజనేయుడి జన్మస్థానాన్ని ధృవీకరించడంతోపాటు, ఇస్రో శాస్త్రవేత్తల సాయంతో శాస్త్రీయ ఆధారాలు కూడా బయటకు తీసిందట.
అయితే టీటీడీ చూపిస్తున్న ఆధారాలు నిలబడతాయా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. రామజన్మభూమి మాదేనంటూ గతంలో నేపాల్ కూడా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అంతమాత్రాన అయోధ్య ఔన్నత్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అయితే ఇప్పుడు ఆంజనేయ జన్మస్థలంపై మన దేశంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీ అధికారికంగా ఆంజనేయుడి జన్మస్థలంపై ప్రకటన ఇస్తే.. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు స్పందించే అవకాశం ఉంది.