Telugu Global
NEWS

అలిపిరి ప్రమాణాలకు లోకేష్ స్థాయి ఎంత..?

అలిపిరి వద్ద ప్రమాణం చేయాలంటూ నారా లోకేష్, సీఎం జగన్ కి సవాల్ విసరడాన్ని పిచ్చి చేష్టగా అభివర్ణించారు మంత్రి కన్నబాబు. అలిపిరి వద్దకు రావాలని సీఎం జగన్ ని పిలవడానికి లోకేష్ కి ఉన్న స్థాయి ఏంటని, ఆయన బతుకెంత అని ప్రశ్నించారు. నిజంగా అలిపిరి వద్ద లోకేష్‌ ప్రమాణం చేయాల్సి వస్తే ఎన్టీఆర్‌ కు తన తండ్రి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని, అధికారం నుంచి దించేయలేదని, ఆయన మరణానికి కారణం చంద్రబాబు కాదని, తన […]

అలిపిరి ప్రమాణాలకు లోకేష్ స్థాయి ఎంత..?
X

అలిపిరి వద్ద ప్రమాణం చేయాలంటూ నారా లోకేష్, సీఎం జగన్ కి సవాల్ విసరడాన్ని పిచ్చి చేష్టగా అభివర్ణించారు మంత్రి కన్నబాబు. అలిపిరి వద్దకు రావాలని సీఎం జగన్ ని పిలవడానికి లోకేష్ కి ఉన్న స్థాయి ఏంటని, ఆయన బతుకెంత అని ప్రశ్నించారు. నిజంగా అలిపిరి వద్ద లోకేష్‌ ప్రమాణం చేయాల్సి వస్తే ఎన్టీఆర్‌ కు తన తండ్రి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని, అధికారం నుంచి దించేయలేదని, ఆయన మరణానికి కారణం చంద్రబాబు కాదని, తన మామ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని, తమ ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో అమాయకుల ప్రాణాలు బలయ్యేందుకు చంద్రబాబు కారకుడు కాదని, రామ్మూర్తి నాయుడిని గొలుసులతో బంధించలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ వివేకా హత్యను కావాలనే లోకేష్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కన్నబాబు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టి, విభజన హామీలను నెరవేర్చలేని టీడీపీ అసమర్థతను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే ఇప్పుడు వివేకా హత్యకేసును తెరపైకి తెస్తున్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తులో ఉన్న కేసుకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టకుండా జీఓలు ఇచ్చారని, అవన్నీ మర్చిపోయిన లోకేష్‌ ప్రమాణాల పేరుతో పిచ్చి మాటల మాట్లాడుతున్నారని విమర్శించారు. లోకేష్ ని మాస్‌ హీరోగా చూపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, దానికోసం ఓ ట్రైనర్ ని కూడా పెట్టారని, ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్న అంశాలన్నీ మక్కికి మక్కి లోకేష్ ప్రదర్శిస్తున్నారని సెటైర్లు వేశారు.

మహిళలంటే సీఎం జగన్ కి ఎంతో గౌరవం ఉందని, అలాంటి జగన్ సోదరీమణులను వివాదాల్లోకి లాగి సంస్కారహీనంగా లోకేష్ మాట్లాడుతున్నారని విమర్శించారు కన్నబాబు. పదే పదే తాడేపల్లి ప్యాలెస్ అంటున్న లోకేష్.. తాడేపల్లిలో తమ నాయకుడు జగన్ నివాసాన్ని ఓసారి ప్రత్యక్షంగా చూడాలని హితవు పలికారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంటిని ప్యాలెస్ అంటారని, జగన్ సాదా సీదా ఇంటిలోనే ఉంటున్నారని చెప్పారు.

లోకేష్ ‌కు, సీఎం జగన్ కు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని, జగన్‌ తన ఒంటిచేత్తో 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిపించుకున్నారని, మంత్రి పదవిలో ఉండి కూడా మంగళగిరిలో గెలవలేని అసమర్థుడు లోకేష్ అని అన్నారు కన్నబాబు. జగన్ ని సవాల్ చేసే స్థాయి లోకేష్ కి లేదని చెప్పారు. తిరుపతి ఎన్నికలో టీడీపీ రెండో స్థానానికి పోటీ పడుతోందని, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీని ఒక్క మాట అనే దమ్ము, ధైర్యం కూడా చంద్రబాబు, లోకేష్ కి లేదని చెప్పారు.

సాక్షాత్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదు అని అన్నారంటే, ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. లోకేష్ వల్లే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని అచ్చెన్నాయుడు చెప్పారని, ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అలిపిరి ప్రమాణాల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో హైలెట్ కాకుండా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు కన్నబాబు.

First Published:  14 April 2021 3:07 PM IST
Next Story