చంద్రబాబు వల్ల ప్రాణహాని.. తిరుపతి పోలీసులకు ఫిర్యాదు..
తిరుపతి హోటల్ లో అచ్చెన్నాయుడు వీడియో వైరల్ కావడంతో దానికి కారకుడైన ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్ తెరపైకి వచ్చారు. చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, టీడీపీ నేతలు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆయన తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఎవరీ వెంకట్..? ఆకుల వెంకటేశ్వరరావు వైజాగ్ నివాసి, చంద్రబాబుకోసమే తాను హైదరాబాద్ వచ్చానని, 30ఏళ్లుగా ఆయన అనుచరుడిగా ఉన్నానని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో తనకు సంబంధించిన స్థలాన్ని కేఎల్ […]
తిరుపతి హోటల్ లో అచ్చెన్నాయుడు వీడియో వైరల్ కావడంతో దానికి కారకుడైన ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్ తెరపైకి వచ్చారు. చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, టీడీపీ నేతలు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆయన తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
ఎవరీ వెంకట్..?
ఆకుల వెంకటేశ్వరరావు వైజాగ్ నివాసి, చంద్రబాబుకోసమే తాను హైదరాబాద్ వచ్చానని, 30ఏళ్లుగా ఆయన అనుచరుడిగా ఉన్నానని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో తనకు సంబంధించిన స్థలాన్ని కేఎల్ నారాయణ అనే వ్యక్తి కబ్జా చేశారని, దానిపై వివాదం కొనసాగుతోందని చెప్పారు. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా, తనకు డబ్బులు ఇప్పించాల్సిందిగా చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ కి గతంలో చాలా సార్లు చెప్పి చూశానని అయినా కూడా వారు తనను పట్టించుకోలేదని అంటున్నారు. చంద్రబాబు ఓ మాట చెబితే తనకు 2కోట్ల రూపాయలు వస్తాయని, అయితే వారెవరూ తనకు న్యాయం చేయడంలేదని, లోకేష్ కు సమస్య చెప్పుకుంటే.. తన కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోమని సలహా ఇచ్చారనేది వెంకట్ చేస్తున్న ఫిర్యాదు. ఇదే విషయంపై తిరుపతి ప్రచారంలో ఉన్న అచ్చెన్నాయుడిని ఆయన ఓ హోటల్ గదిలో కలసి చర్చించారు. అక్కడే లోకేష్ ని వాడు, వీడు అంటూ సంబోధించారు కూడా. వెంకట్ మాటలు విన్న అచ్చెన్నాయుడు.. “ఆవేశ పడొద్దు, మనుషులు బాగుంటే పార్టీ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు, ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదు” అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం బయటపడిన రోజు రాత్రి(మంగళవారం) వెంకట్ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో బయటకు రావడంతో చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు వెంకట్.
రాళ్లదాడి అంతా నాటకం..
తిరుపతి బహిరంగ సభలో తన సమస్య పరిష్కరించాలని మరోసారి చంద్రబాబుని వేడుకునేందుకు వెళ్లానని అంటున్న వెంకట్, తన చొక్కా విప్పి చంద్రబాబుపైకి విసిరేశానని అన్నారు. అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు తనపై రాళ్లదాడి జరిగిందని చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి జరగలేదని, అదంతా బూటకం అని చెప్పుకొచ్చారు వెంకట్.
టీడీపీ స్పందన ఏంటి..?
అచ్చెన్నాయుడు, వెంకట్ హోటల్ గదిలో మాట్లాడుకున్నట్టు బయటకు వచ్చిన వీడియోపై టీడీపీ నుంచి అధికారికంగా ఎవరూ స్పందించడంలేదు. అచ్చెన్నాయుడు మాత్రం ఆ వీడియో అంతా ఫేక్ అని మీడియాకు వెళ్లడించారు. తనకు, లోకేష్ కు మధ్య విభేదాలు సృష్టించాలనే ప్రత్యర్థులు ఆ వీడియో సృష్టించారని అంటున్నారాయన. మొత్తమ్మీద ఆకుల వెంకట్ వ్యవహారం టీడీపీలో కలకలం రేపింది. తిరుపతి ఉప ఎన్నికల నేఫథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.