Telugu Global
National

జరిమానాలతో మాస్క్ నిలబడేనా..?

కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతోంది. భారత్ లో పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తొలి దశ కేసుల్ని దాటేస్తోంది, మహారాష్ట్ర సగం భారం తానే తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు కూడా సెకండ్ వేవ్ కేసుల్లో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్ కి భయపడుతున్నాయి. ఈ దశలో కనీసం బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం ప్రజలందరి బాధ్యత. అయినా కూడా నిర్లక్ష్యం మాస్క్ ని కప్పేస్తోంది. సామాజిక దూరం కనుమరుగైంది, కనీసం […]

జరిమానాలతో మాస్క్ నిలబడేనా..?
X

కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతోంది. భారత్ లో పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తొలి దశ కేసుల్ని దాటేస్తోంది, మహారాష్ట్ర సగం భారం తానే తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు కూడా సెకండ్ వేవ్ కేసుల్లో పోటీ పడుతున్నాయి. ప్రభుత్వాలు లాక్ డౌన్ కి భయపడుతున్నాయి. ఈ దశలో కనీసం బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం ప్రజలందరి బాధ్యత. అయినా కూడా నిర్లక్ష్యం మాస్క్ ని కప్పేస్తోంది. సామాజిక దూరం కనుమరుగైంది, కనీసం మాస్క్ కూడా ధరించకపోతే ఎలా అంటూ ప్రభుత్వాలు జరిమానాలతో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ పరిధిలో వెయ్యి రూపాయల జరిమానాను అధికారికం చేశారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని తెలంగాణ సర్కారు ఆదివారం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌లు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని.. విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు, ఐపీఎస్‌ 188వ సెక్షన్‌ కింద కేసుల నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డీజీపీ, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ఈ అధికారం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో ఈనెల 5 నుంచి 11వతేదీ ఉదయం వరకు మాస్క్ లేనివారిపై 6,478 కేసులు నమోదు చేశారు. వీటిలో హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధి‌లో అత్యధికంగా 2,030 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారు కోర్టుకి వెయ్యి జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు పోలీసులు.

ఏపీలోనూ జరిమానాలు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఏపీలో కూడా మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ.. జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

మిగతా చోట్ల జరిమానా లెక్కలివి..

కర్ణాటకలో రూ. 10 వేలు
మాస్క్ లేకపోతే అత్యధిక జరిమానా విధిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ముందుంది. ఇక్కడ మాస్క్ లేకపోతే రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఇది సభలు, సమావేశాలకే పరిమితం. ఏప్రిల్‌ 1 నుంచి దీనిని కఠినంగా అమలు చేస్తున్నారు. ఏసీ హాళ్లు.. దుకాణాల్లో సామాజిక దూకం పాటించకపోతే, నిర్వాహకుల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తారు. స్టార్‌ హోటళ్లు, 500 మందికి మించి హాజరయ్యే ఫంక్షన్ హాళ్లు, బహిరంగ సభల నిర్వాహకుల నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేలు వసూలు చేస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వస్తే నగరాల్లో రూ.250, గ్రామాల్లో రూ.100 జరిమానా విధిస్తున్నారు.

ఢిల్లీలో రూ.500 నుంచి రూ. 2000
దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్ లేకపోతే విధించే జరిమానాను రూ.500నుంచి 2వేలకు పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పంపిణీ చేయాలని అన్ని రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. అటు ఢిల్లీ హైకోర్టు కూడా మాస్క్ ల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. కారులో ఒంటరిగా పోతున్నా కూడా మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో రూ. 200
భారత్ లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో మాస్క్ లేకపోతే రూ.200 జరిమానా చెల్లించాల్సిందే. ముంబై కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు. స్థానిక బస్సులు, లోకల్‌ రైళ్లలో ప్రయాణించేవారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.

ఒడిశాలో మూడోసారి తప్పు చేస్తే..
ఒడిశా ప్రభుత్వం కూడా మాస్క్‌ ధరించని వారిపై భారీగా జరిమానా విధిస్తోంది. తొలిసారి, రెండో సారి మాస్క్‌ లేకుండా కనపడితే రూ.2వేలు, అదే తప్పు మళ్లీ చేస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి దేశంలోని ఎక్కడి నుంచైనా ఒడిశాకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న నివేదిక, లేదా టీకా వేయించుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే స్పష్టం చేసింది.

విదేశాల్లో మరింత కఠినం..
మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారినుంచి విదేశాల్లో భారీ జరిమానాలు వసూలు చేస్తున్నారు. సాక్షాత్తూ నార్వే ప్రధాని ఇటీవల తన పుట్టినరోజు వేడుకలో కొవిడ్ నిబంధనలు పాటించలేదని, స్థానిక పోలీసులు ఆమెకు లక్ష 75వేల రూపాయలు జరిమానా విధించారు. ప్రధాని ఎర్నా సాల్ బర్గ్.. ఆ మొత్తాన్ని చెల్లించారు కూడా. విదేశాల్లో జరిమానా నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా అంతే భయంతో నిబంధనలు పాటిస్తున్నారు. భారత్ లో మాత్రం సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా.. సామాజికంగా పెద్ద మార్పేమీ కనిపించడంలేదు. అధికారిక లాక్ డౌన్ లేకపోవడంతో.. కరోనా భయం లేనట్టే ప్రజలు ప్రవర్తిస్తున్నారు.

First Published:  12 April 2021 2:23 AM IST
Next Story