Telugu Global
National

కేంద్రంతో రాష్ట్రాల టీకా వార్..

దేశవ్యాప్తంగా టీకాల వృథా ఎక్కువవుతోందని, సకాలంలో అన్నిటినీ వినియోగించాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని ఆమధ్య ముఖ్యమంత్రుల సమావేశంలో సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. కట్ చేస్తే.. నెక్స్ట్ మీటింగ్ కల్లా రాష్ట్రాల వద్ద టీకాల కొరత ఏర్పడింది. మాకు ఇన్ని డోస్ లు కావాలంటే, మాకు ఇన్ని కావాలంటూ ముఖ్యమంత్రులు లిస్ట్ చదివారు, ప్రత్యేకంగా లేఖలు రాశారు. అయితే వీరందరికీ టీకా సర్దుబాటు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రడీ టీకాకు […]

కేంద్రంతో రాష్ట్రాల టీకా వార్..
X

దేశవ్యాప్తంగా టీకాల వృథా ఎక్కువవుతోందని, సకాలంలో అన్నిటినీ వినియోగించాలని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని ఆమధ్య ముఖ్యమంత్రుల సమావేశంలో సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. కట్ చేస్తే.. నెక్స్ట్ మీటింగ్ కల్లా రాష్ట్రాల వద్ద టీకాల కొరత ఏర్పడింది. మాకు ఇన్ని డోస్ లు కావాలంటే, మాకు ఇన్ని కావాలంటూ ముఖ్యమంత్రులు లిస్ట్ చదివారు, ప్రత్యేకంగా లేఖలు రాశారు. అయితే వీరందరికీ టీకా సర్దుబాటు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రడీ టీకాకు నో స్టాక్ బోర్డ్ పెట్టేశాయి ఆస్పత్రులు. మహారాష్ట్రలో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీకాల కొరతతో ముంబైలో 70 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూసేశామని ఆ రాష్ట్ర మంత్రి తోపే చెప్పారు. తాజాగా దేశవ్యాప్తంగా 3.5కోట్ల టీకాలు పంపిణీ చేస్తే, కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు 7 లక్షల డోసులే వచ్చాయని, ఒత్తిడి చేస్తే మరో 10లక్షలు అదనంగా పంపించారని ఆరోపించారు. టీకాల పంపిణీలో కేంద్రం సరైన విధి విధానాలను అనుసరించడంలేదని మండిపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 8లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అవి సరిపోవని ఆయన తెలిపారు. లేనిపోని వివాదాలు సృష్టించకుండా రాష్ట్రానికి అవసరమైన టీకా డోసులను పంపించాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కూడా కేంద్రానికి సూచించారు.

ఉన్న టీకాలను సరిగా వేయండి..
కేంద్రంవైపు మహారాష్ట్ర సర్కారు వేలెత్తి చూపిస్తుంటే.. ముందు ఉన్న టీకాలు సరిగా వాడండి అంటూ సుద్దులు చెబుతున్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. శుక్రవారం నాటికి మహారాష్ట్రకి మొత్తం 1.10 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. ప్రస్తుతం 15.63 లక్షలు ఉన్నాయని చెప్పారు. నో స్టాక్ బోర్డులు పెట్టడంలో అర్థం లేదని అన్నారు. సరైన రీతిలో టీకా పంపిణీ చేయాలని సూచించారు. టీకాల పంపిణీలో కేంద్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని మహారాష్ట్ర చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన, రాజకీయాలకు ఇది తగిన సమయం కాదని చెప్పారు.

కాంగ్రెస్ ఆగ్రహం..
మరోవైపు టీకాల వినియోగంపై కేంద్రం సరైన చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయిన ఆమె, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడిందని, అయినా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలే టీకా కొరతకు కారణమని అన్నారు సోనియా. ఇతర దేశాలకు ఎగుమతులు, బహుమతులు అంటూ టీకాని పంచి పెట్టారని, కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యానికి ఇదే నిదర్శనం అని అన్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరతకు కారణం కేంద్రమేనని మండిపడ్డారు.

మొత్తమ్మీద టీకా వ్యవహారంలో మరోసారి వివాదాల తేనెతుట్టె కదిలింది. టీకా కొరత ఉందని, దానికి కారణం మీరేనంటూ కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుంటే.. టీకా వినియోగం రాష్ట్రాలకు చేతకావడవలేదని బీజేపీ మండిపడుతోంది.

First Published:  11 April 2021 10:46 AM IST
Next Story