సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు..
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈనెల 14న జరగాల్సిన ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. “ఈ నెల 14న బహిరంగ సభకు వచ్చి తిరుపతి, నెల్లూరు ప్రజల ఆత్మీయత, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని అనుకున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సభ రద్దు […]
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈనెల 14న జరగాల్సిన ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు.
“ఈ నెల 14న బహిరంగ సభకు వచ్చి తిరుపతి, నెల్లూరు ప్రజల ఆత్మీయత, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని అనుకున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే సభ రద్దు చేయడమే మేలు అనిపించింది. అందులోనూ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల విషయంలో జాతీయ సగటు 5.87గా ఉంటే.. ఏపీ సగటు 8.67గా ఉంది, ఇది ఆందోళనకర విషయం. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కేసుల సంఖ్య మరీ అధికంగా ఉంది. రాష్ట్రంలో నమోదైన 2765 కేసుల్లో చిత్తూరులో 496, నెల్లూరులో 292 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా కారణంగా 11మంది చనిపోయారు. బహిరంగ సభ పెడితే భారీగా జనాలు హాజరవుతారు. కరోనా వ్యాప్తికి అదో కారణం అవుతుంది. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా.” అంటూ ఓ లేఖను విడుదల చేశారు.
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాను రాలేకపోతున్నానని, 22 నెలల్లో తమ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలందరికీ చేరిందన్న నమ్మకం తనకుందని ఇటీవల జగన్ తిరుపతి ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. గురుమూర్తిని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ లేఖలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ లేఖ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాజాగా తన పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు సీఎం. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తరపున భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు. అటు టీడీపీ తరపున చంద్రబాబు, లోకేష్ కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే మకాం వేశారు. సీఎం జగన్ పర్యటనకి భారీగా జన సమీకరణ చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. కరోనా ఉధృతి కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు సీఎం.