Telugu Global
National

అనిల్ రాజీనామా.. మహారాష్ట్రలో సంక్షోభం మొదలైనట్టేనా..?

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాల తీరు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఉంటుంది. సరిగ్గా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తుకి ఆదేశించడంతో అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ దర్యాప్తు నిలిపివేయాలంటూ మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది. దీంతో ప్రతిపక్ష బీజేపీ, […]

అనిల్ రాజీనామా.. మహారాష్ట్రలో సంక్షోభం మొదలైనట్టేనా..?
X

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రాల్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాల తీరు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు ఉంటుంది. సరిగ్గా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిందిగా బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తుకి ఆదేశించడంతో అనిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ దర్యాప్తు నిలిపివేయాలంటూ మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతోంది. దీంతో ప్రతిపక్ష బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కోర్టు చీవాట్లు పెట్టిన వేళ, మహారాష్ట్రలో ప్రభుత్వం మనుగడకు అవకాశం లేదని, వెంటనే దిగిపోవాలని, తమ నిజాయితీ నిరూపించుకునేందుకు ప్రజా తీర్పుని కోరాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. మహారాష్ట్రలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు హోం మంత్రి అనిల్ రాజీనామాతో రాజకీయ కల్లోలం మొదలైంది.

అసలేం జరిగింది..?
శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో ఎన్సీపీ తరపున హోం మంత్రిగా ఉన్నారు అనిల్ దేశ్ ముఖ్. ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన పోలీస్ అధికారి సచిన్‌ వాజేకు.. హోం మంత్రి అనిల్ దేశ్ ‌ముఖ్ కి అక్రమ లావాదేవీలు ఉన్నాయని పరమ్ బీర్ సింగ్ అనే మరో అధికారి సంచలన ఆరోపణలు చేశారు. తనను పదవిలోనుంచి తప్పించడానికి కారణం అదేనని, సచినా వాజేకు మంత్రి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూళ్లను టార్గెట్ గా పెట్టారని ఆరోపించారు పరమ్ బీర్. ఆరోపణలు వచ్చినరోజే.. అనిల్ రాజీనామాకు శివసేన పట్టుబట్టినా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పార్టీ నేతను వెనకేసుకు వచ్చారు. అనిల్ రాజీనామా అవసరంలేదని, ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశారు. కూటమిలోని మరో పార్టీ కాంగ్రెస్ కూడా అనిల్ కు వత్తాసు పలకడంతో అక్కడితో ఆ కథ ముగిసిందని అనుకున్నారు. తాజాగా బాంబే హైకోర్టు మంత్రి అనిల్ పై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని ఆదేశాలివ్వడంతో కథ మలుపు తిరిగింది.

ఇటీవలే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్, ఆపరేషన్ తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఆయన సూచన మేరకే అనిల్ రాజీనామా చేశారు, ఆ స్థానంలో ఎన్సీపీకే చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ను మహారాష్ట్ర కొత్త హోం మంత్రిగా నియమించారు. ప్రస్తుతం ఆయన కార్మిక, ఎక్సైజ్ శాఖల మంత్రిగా ఉన్నారు. శరద్ పవార్ కు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేశారు.

అయితే ఈ ఎపిసోడ్ అనిల్ రాజీనామాతో ముగిసిపోలేదని, మొత్తం మహారాష్ట్ర సర్కారు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర నేతలు సహా.. కేంద్ర మంత్రులు కూడా ఇదే పల్లవి అందుకున్నారు. అంబానీ ఇంటివద్ద జరిగిన ఘటన.. చినికి చినికి గాలివానలా మారి మంత్రి పదవినే ఉడగొట్టింది.. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారుని సంక్షోంభంలోకి నెడుతోంది.

First Published:  5 April 2021 8:38 PM GMT
Next Story