ఆలయాలను తాకిన సెకండ్ వేవ్.. షిర్డీ మూత..
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. గతంలో లాక్ డౌన్ కంటే ముందే మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేసిన ట్రస్ట్ అధికారులు.. సెకండ్ వేవ్ లో కూడా ముందు జాగ్రత్త చర్యలు పాటించారు. షిర్డీ ఆలయాన్ని ఈనెల 30వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయం మేరకు బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయం, భక్త నివాస్ కూడా మూసివేశారు. అయితే రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో […]
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఆలయాలను తాకింది. గతంలో లాక్ డౌన్ కంటే ముందే మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేసిన ట్రస్ట్ అధికారులు.. సెకండ్ వేవ్ లో కూడా ముందు జాగ్రత్త చర్యలు పాటించారు. షిర్డీ ఆలయాన్ని ఈనెల 30వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయం మేరకు బాబా ఆలయంతో పాటు ప్రసాదాలయం, భక్త నివాస్ కూడా మూసివేశారు. అయితే రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కోవిడ్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులు మాత్రం పనిచేస్తాయి.
అటు ఉత్తరాఖండ్ లో కూడా ఆంక్షలు కఠినతరం చేయడంతో కుంభమేళా వెలవెలబోతోంది. ఘాట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉన్నవారికే ఉత్తరాఖండ్ లోకి ఎంట్రీ అని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో భక్తుల తాకిడి బాగా తగ్గింది.
తిరుమలపై కూడా ప్రభావం..
మహారాష్ట్రలో రాత్రివేళ లాక్ డౌన్ అమలు చేయడం, వారాంతంలో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడినుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈనెల 14నుంచి ప్రారంభం కావాల్సిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా.. వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఆంక్షలు కఠినతరం..
తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ముందురోజే అనుమతి తీసుకోవాలనే నిర్ణయాన్ని తిరిగి అమలులోకి తీసుకొచ్చారు. కాలినడకన కొండ ఎక్కాలనుకునేవారికి ముందురోజు అనుమతి తప్పనిసరి. వాహనాల ద్వారా కొండపైకి వెళ్లాలనుకునేవారు కూడా ముందుగానే అనుమతి తీసుకోవాలి.
తెలంగాణ మెదక్ లోని ఏడుపాయల వన దుర్గాదేవి గుడిని కూడా ఇటీవలే కరోనా కారణంగా మూసి వేశారు. అటు యాదాద్రికి కూడా కరోనా సెగ తగిలింది. వారం రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. తిరిగి ఇప్పుడు సేవలను ప్రారంభించారు. మొత్తమ్మీద సెకండ్ వేవ్ సెగ ఆలయాలకు గట్టిగానే తగిలినట్టు అర్థమవుతోంది.