Telugu Global
NEWS

టీడీపీలో గందరగోళ పరిస్థితులు.. తలలు పట్టుకుంటున్న వీరాభిమానులు!

టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాదేశిక ఎలక్షన్స్ లో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నారు.. ఎక్కడ పోటీ చేయడంలేదన్న అంశం అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు స్పందిస్తూ.. తమ పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారు. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల బరి నుంచి తమ అభ్యర్థులు తప్పుకునేదిలేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఈ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయినా ఆ పార్టీ మాజీ […]

టీడీపీలో గందరగోళ పరిస్థితులు.. తలలు పట్టుకుంటున్న వీరాభిమానులు!
X

టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాదేశిక ఎలక్షన్స్ లో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నారు.. ఎక్కడ పోటీ చేయడంలేదన్న అంశం అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు స్పందిస్తూ.. తమ పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారు.

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల బరి నుంచి తమ అభ్యర్థులు తప్పుకునేదిలేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఈ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయినా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం బరిలోకి దిగుతున్నట్లుగా ఎవరికివారే ప్రకటించుకున్నారు.

సాధారణంగా ప్రాంతీయ పార్టీలో అధినేతలు ఏది చెప్పితే అదే వేదం. లేదా అధ్యక్షుడి కనుసన్నల్లోనైనా వ్యవహారం నడుస్తుంది. కానీ ఒక్కసారి అధినేత పట్టు జారిదంటే.. ఆ తర్వాత పార్టీ పరిస్థితి కూడా చేయి జారే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశంలో ఇదే జరుగుతోంది. ఇదంతా అధినేత చంద్రబాబునాయుడు తనంత తాను చేసుకున్నదే అని చెప్పొచ్చు. ప్రాదేశిక ఎన్నికల బహిష్కరణ అనేది చంద్రబాబు నాయుడు చేసుకున్న సెల్ఫ్ గోల్. దాన్ని సమర్ధించడానికి పార్టీలో కొందరు చాలా ప్రయాస పడుతున్నారు. జయలలిత, మాయావతి పేర్లను తెరపైకి తెస్తున్నారు. వారు ఉపఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేసి పార్టీ పరిస్థితిని డొల్లగా మార్చలేదు.

అయితే ఈ విషయం తెలుగుదేశంపార్టీ నాయకులకు కూడా తెలుసు. అందుకే కొందరు తాము పోటీలో ఉన్నట్లే అని ప్రకటించేసుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమ అఖిలప్రియా ఇదే విషయాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలోని మండలాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆమె తుంగలో తొక్కారు. చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ విషయాన్ని ప్రకటించిందే ఆలస్యం.. కొంతమంది నేతలు ఖర్చులు మిగిలాయని సంబరాలు చేసుకున్నారట. అంతేకాదు ఎండల్లో తిరిగే పని కూడా లేదని.. బాబు ప్రకటనను సమర్ధించారట.

ఇక నామినేషన్లు కూడా దాఖలయ్యాయి కాబట్టి వీరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అయితే టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది.. ఎక్కడా బహిష్కరించింది అనే విషయాలపై క్లారిటీ లేక పార్టీ వీరాభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంశం ఆ పార్టీలో పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తోందనే చెప్పాలి. సైకిల్ పంచర్ అయి పూర్తిగా బ్యాలెన్స్ తప్పినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

First Published:  6 April 2021 10:33 AM IST
Next Story