Telugu Global
NEWS

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ.. కొండంత రాగం.. సునామీ అవుతుందా..

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఉద్భవిస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షర్మిలా పార్టీ స్థాపించేందుకు సిద్ధం అవుతుంటే మరో పార్టీ కూడా వస్తోందనే సమాచారం బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, కొత్త రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. దాని ధాటికి అప్పటికే బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ […]

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ.. కొండంత రాగం.. సునామీ అవుతుందా..
X

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఉద్భవిస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షర్మిలా పార్టీ స్థాపించేందుకు సిద్ధం అవుతుంటే మరో పార్టీ కూడా వస్తోందనే సమాచారం బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, కొత్త రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. దాని ధాటికి అప్పటికే బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం కుదేలు అయ్యింది. మరో వైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ జోరుకు నిలవలేకపోయింది. ముఖ్యంగా వలసలతో పాటు, రాజకీయ వ్యూహాలతో కేసీఆర్ తెలంగాణలో మరో రాజకీయ శక్తి రాకుండా ప్రణాళికలు వేయడంలో సఫలం అయ్యారు. అయితే బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలోని నేతలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే బీజేపీ శక్తి కూడా టీఆర్ఎస్ ను ఎదిరించేందుకు సరిపోదని, తెలంగాణలోని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే జాతీయ పార్టీగా బీజేపీకి కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బీజేపీ అనకున్నంత వేగంగా జనాల్లోకి చొచ్చుకువెళ్లలేని పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణలోని సామాజిక పొందిక కూడా బీజేపీకి అంత అనకూల వాతావరణం కల్పించడం లేదనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీని తెలంగాణలోని మేజర్ ఓట్ బ్యాంకు దూరంగా జరిగే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, తెలంగాణలో బీజేపీకి దూరం నిలిచే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కేసీఆర్ కు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఆయా వర్గాలను కన్సాలిడేటెడ్ గా తన వైపు మలుచుకునే రాజకీయం కేసీఆర్ సొంతం.

అయితే కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే మరో బలమైన ప్రాంతీయ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని, పలువరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ తరహాలోనే బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందని మెజారిటీ టీఆర్ఎస్ వ్యతిరేక వర్గం భావిస్తోంది. అయితే టీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వారితో కలిసి కొత్త పార్టీని పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఈమధ్యనే ఆయన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరంతా కలిసి వస్తే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దంగా ఉన్నానని.. లేదంటే తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదన్నారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్ వ్యతిరేకులను కలిశానని, త్వరలోనే రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు.

అయితే కొండా చేస్తున్న ప్రయత్నం సఫలం అయితే బలమైన ప్రాంతీయ పార్టీ వేళ్లూనుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం గత 7 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉంది. అటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. బీజేపీ కూడా టార్గెట్ 2028 అన్నట్లే ఉన్నారు తప్ప, కేసీఆర్ తో బద్ధ వైరుద్ధ్యాన్ని పాటించట్లేదు. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేకులను ఒక తాటిపైకి తెచ్చి సమర భేరి మోగించేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. కొండా వర్గానికి ఆర్థికంగా అన్ని రకాల అండదండలు ఉన్నాయి. అంతకు మించి సామాజిక ఇంజనీరింగ్ పరంగా చూస్తే బలమైన రెడ్డి సామాజిక వర్గం అండగా నిలవవచ్చు. అలాగే కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు అయిన మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కొత్త పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అటు రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ కనుక కలిస్తే కొండా ప్రయత్నం సఫలం అయినట్లే..అయితే ముందు ముందు ఏం జరుగుతుంది. అనేది కాలమే తేల్చాల్సి ఉంది.

First Published:  5 April 2021 11:51 AM IST
Next Story