టీడీపీ అస్త్ర సన్యాసం.. బీజేపీలో కొత్త ఉత్సాహం..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కావాలనేదీ టీడీపీ, బీజేపీ, జనసేన వాదన. ఏకగ్రీవాలు రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ తో ఎన్నికలు జరిపేలా చూడాలని మూడు పార్టీలు వేర్వేరుగా హైకోర్టుని ఆశ్రయించాయి. గతంలో నిమ్మగడ్డ, ఏకగ్రీవాలపై ఎంక్వయిరీ పెడితే.. హైకోర్టు దాన్ని అడ్డుకుంది, రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవం అయినట్టు ధృవీకరించిన తర్వాత దాన్ని తప్పుబట్టే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అంటే దానర్థం కొత్త నోటిఫికేషన్ కుదరదనే. అయినా కూడా పట్టు వదలకుండా ప్రతిపక్షాలు […]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కావాలనేదీ టీడీపీ, బీజేపీ, జనసేన వాదన. ఏకగ్రీవాలు రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ తో ఎన్నికలు జరిపేలా చూడాలని మూడు పార్టీలు వేర్వేరుగా హైకోర్టుని ఆశ్రయించాయి. గతంలో నిమ్మగడ్డ, ఏకగ్రీవాలపై ఎంక్వయిరీ పెడితే.. హైకోర్టు దాన్ని అడ్డుకుంది, రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవం అయినట్టు ధృవీకరించిన తర్వాత దాన్ని తప్పుబట్టే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అంటే దానర్థం కొత్త నోటిఫికేషన్ కుదరదనే. అయినా కూడా పట్టు వదలకుండా ప్రతిపక్షాలు కోర్టుకి పిటిషన్లు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఆగిపోయిన పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. సింగిల్ ఫేజ్ లో ఈ నెల 8న పోలింగ్, 10న కౌంటింగ్, రిజల్ట్ అని చెప్పారు. దీంతో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తమతోపాటు బీజేపీ, జనసేన, సీపీఐ కూడా ఎన్నికలు బహిష్కరిస్తాయని, వైసీపీని టార్గెట్ చేయొచ్చనేది బాబు ఆలోచన. అయితే బీజేపీ, సీపీఐ చంద్రబాబుకి షాకిచ్చాయి. తాము ఎన్నికల బరిలోనే ఉన్నామంటూ ప్రకటించాయి.
బీజేపీకి పండగ..
చంద్రబాబు వెనకడుగుతో బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. ఏపీలో వైసీపీకి అసలు సిసలు ప్రత్యామ్నాయం తామేనంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు ఆ పార్టీ నేతలు. ఎన్నికలకు భయపడి టీడీపీ పారిపోయిందని, వైసీపీని ఢీకొనే సత్తా తమకే ఉందని, అందుకే తాము పోటీలో ఉన్నామని చెబుతున్నారు బీజేపీ నేతలు. పనిలో పనిగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు సోము వీర్రాజు. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ప్రజా క్షేత్రంలో ఓట్లు పడినా పడకపోయినా.. వైసీపీకి పోటీ తామే, టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోడానికి బీజేపీకి ఇప్పుడో బలమైన పాయింట్ దొరికినట్టయింది.
ఒకరకంగా తిరుపతి ఉప ఎన్నికలో కూడా ఈ వ్యవహారం తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించిన టీడీపీ, తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం ఎందుకు పోటీ చేస్తోందని లాజిక్ తీస్తున్నారు. తిరుపతిలో పోటీ చేసే అర్హత ఆ పార్టీకి లేదని అంటున్నారు బీజేపీ నేతలు. తిరుపతిలో టీడీపీకి ఓటు వేస్తే అది మురిగిపోయినట్టేనని.. వైసీపీని వ్యతిరేకించేవారంతా బీజేపీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ పర్యటనలో కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక వేళ, చంద్రబాబు అస్త్ర సన్యాసం బీజేపీకి అనుకోని వరంలా దొరికింది.