Telugu Global
International

ఓడ కదిలింది.. ముప్పు తప్పింది..

వారం రోజులుగా టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచిన సూయజ్ కాల్వలో నిలిచిపోయిన ‘ఎవర్ గివెన్’ ఓడ ఎట్టకేలకు కదిలింది. సూయజ్ కాల్వకు అడ్డంగా ఇరుక్కు పోయిన ఈ నౌక పొడవు 400 మీటర్లు, సామానుతో కలిపి బరువు 2.2లక్షల టన్నులు. ఇంత భారీ ఓడను కదిలించడం ఎవరి తరం కాదని, నెలలతరబడి అంతర్జాతీయ సరకు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుకుంటున్న నేపథ్యంలో వారం రోజుల్లోగా ఎవర్ గివెన్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు నిపుణులు. […]

ఓడ కదిలింది.. ముప్పు తప్పింది..
X

వారం రోజులుగా టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచిన సూయజ్ కాల్వలో నిలిచిపోయిన ‘ఎవర్ గివెన్’ ఓడ ఎట్టకేలకు కదిలింది. సూయజ్ కాల్వకు అడ్డంగా ఇరుక్కు పోయిన ఈ నౌక పొడవు 400 మీటర్లు, సామానుతో కలిపి బరువు 2.2లక్షల టన్నులు. ఇంత భారీ ఓడను కదిలించడం ఎవరి తరం కాదని, నెలలతరబడి అంతర్జాతీయ సరకు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతాయని అనుకుంటున్న నేపథ్యంలో వారం రోజుల్లోగా ఎవర్ గివెన్ ను సాధారణ స్థితికి తీసుకొచ్చారు నిపుణులు. ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మతుల సంస్థ ఈ పని పూర్తి చేసింది. మార్చి 23 మంగళవారం ఉదయం ఈ నౌక సూయజ్ లో ఇరుక్కుపోగా.. 29వతేదీ సాయంత్రానికి దీన్ని పక్కకు తీసుకురాగలిగారు.

ఎవర్ గివెన్ ను పక్కకు తీయడానికి, తొలుత ఒడ్డున ఉన్న ఇసుక తొలగించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నౌక చుట్టూ 18మీటర్ల లోతు వరకు 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ట్రెడ్జింగ్ చేస్తూ తొలగించారు. అదే సమయంలో 10 భారీ టగ్ బోట్లతో నౌకను వెనక్కు లాగే ప్రయత్నం కూడా చేశారు. మానవ ప్రయత్నానికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం. అలలు పోటెత్తడంతో ఎట్టకేలకు ఆపరేషన్ సక్సెస్ అయింది, ఎవర్ గివెన్ పక్కకు తొలగింది.

వారం రోజులుగా ఈ నౌక సూయజ్ కి అడ్డుగా నిలబడిపోవడంతో రోజుకి 900కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. సూయజ్‌ కాల్వ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్‌ గివెన్‌ నౌకను ప్రస్తుతానికి కదిల్చినా, ఈ కాల్వ ద్వారా సాధారణ స్థాయిలో రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు అటు, ఇటు నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్‌ అయ్యేందుకు 10 రోజుల సమయం పడుతుందని రిఫినిటివ్‌ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోగా మిగతావి కాల్వలోనే ఉండిపోయాయి. అంతర్జాతీయ సరకురవాణాలో 10శాతం సూయజ్ కాల్వగుండానే జరుగుతుంది. గతేడాది ఈ మార్గం గుండా 19వేలకు పైగా భారీ నౌకలు వెళ్లాయి. ఎవర్ గివెన్ ఉదంతంతో.. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రణాళికలు రచిస్తున్నారు నిపుణులు.

First Published:  30 March 2021 2:34 AM IST
Next Story