Telugu Global
NEWS

లాయర్, డాక్టర్.. మధ్యలో జానా..

సాగర్ సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల ఎత్తులు.. అన్ని లెక్కలు పూర్తయ్యాక ఇరు పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీకి దిగుతారు. బీజేపీ తరపున గిరిజన డాక్టర్ పానుగోతు రవికుమార్ బరిలో దిగుతున్నారు. సింపతీకే ఓటు.. భగత్ కి టికెట్ ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ బాగా టైమ్ తీసుకుంది. దుబ్బాకలో సింపతీ ఓట్లపై […]

లాయర్, డాక్టర్.. మధ్యలో జానా..
X

సాగర్ సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల ఎత్తులు.. అన్ని లెక్కలు పూర్తయ్యాక ఇరు పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీకి దిగుతారు. బీజేపీ తరపున గిరిజన డాక్టర్ పానుగోతు రవికుమార్ బరిలో దిగుతున్నారు.

సింపతీకే ఓటు..
భగత్ కి టికెట్ ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ బాగా టైమ్ తీసుకుంది. దుబ్బాకలో సింపతీ ఓట్లపై నమ్మకం పెట్టుకుని దెబ్బతిన్న టీఆర్ఎస్ మరోసారి అలాంటి ఫలితమే ఎదురవుతుందేమోనని ఆలోచించింది. చివరకు నర్సింహయ్య కుటుంబానికే టికెట్ ఇచ్చింది. ప్రత్యర్థి బీజేపీ వ్యూహాలను అంచనా వేసేందుకే టీఆర్ఎస్ ఇన్నిరోజులు వేచి చూసి, చివరి నిముషంలో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కి టికెట్ కన్ఫామ్ చేసింది. ఈ సందర్భంగా నోముల కుటుంబం కేసీఆర్ తో సమావేశమైంది. నర్సింహయ్యతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇస్తున్నామని, గతంలో మాదిరిగా కాకుండా పార్టీ నేతలంతా కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని తాను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు కేసీఆర్. చివరి నిముషం వరకు టికెట్ ఆశించిన కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిలను కేసీఆర్ బుజ్జగించారు. వారితో కలసి భోజనం చేసిన కేసీఆర్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. భగత్ తో కలసి పనిచేయాలని, ప్రచారంలో పాల్గొనాలని, కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాలని హితబోధ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా ఉన్న భగత్, తండ్రి నర్సింహయ్య మరణంతో ఇలా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.

గిరిజన ఓట్లకు బీజేపీ గాలం..
రెండేళ్ల క్రితం సాగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసిన నివేదితా రెడ్డి ఈ సారి కూడా టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆమెతోపాటు, అంజయ్య యాదవ్, ఇంద్రసేనా రెడ్డి కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు. వారెవర్నీ కాదని, రాజకీయాలకు సంబంధంలేని ఓ గిరిజన డాక్టర్ ని తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన డాక్టర్ పానుగోతు రవికుమార్ బీజేపీ తరపున సాగర్ బరిలో దిగుతున్నారు. ఈమేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తూ, నిర్మల ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్న రవికుమార్.. ఇప్పుడు కొత్తగా రాజకీయ ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. నాగార్జున సాగర్ పరిధిలోని ఎస్టీ సామాజిక వర్గ ఓట్లన్నీ గుంపగుత్తగా బీజేపీకే పడతాయని అంచనా వేస్తున్నారు నాయకులు.

జూనియర్లతో సీనియర్ జానా పోటీ..
బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. రాజకీయ అనుభవం కూడా తక్కువే. అయితే గెలుపుపై ఎవరి లెక్కలు వారికున్నాయి. వీరిద్దరితో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానా రెడ్డి పోటీ ఎదుర్కొంటున్నారు. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆల్రడీ ఆయన ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. తనకంటే బాగా చిన్నవారైన ఇద్దరు ప్రత్యర్థులను జానారెడ్డి తన అనుభవంతో ఓడించగలరా, లేక కూలిపోతున్న కాంగ్రెస్ ప్రాభవానికి మౌన సాక్షిగా నిలబడతారా అనేది వేచి చూడాలి.

First Published:  30 March 2021 3:06 AM IST
Next Story