ప్రచారానికి పవన్ సిద్ధమేనా..?
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన మధ్య సీటు పంచాయితీ జరిగిన మాట వాస్తవమే. చివరి వరకు జనసేన అభ్యర్థికి అవకాశం ఉంటుందని అనుకున్నా.. సాధ్యపడలేదు. తిరుపతిలో పవన్ పర్యటన చేసి ఓ అంచనాకు వచ్చినా, సామాజిక వర్గ ఓట్లపై లెక్కలు వేసుకున్నా, ఢిల్లీ టూర్ తో ఒత్తిడి పెంచినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బీజేపీ తరపున రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ-జనసేన మధ్య విభేదాలు పెరిగాయనే ప్రచారం జోరుగా సాగుతున్న […]
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన మధ్య సీటు పంచాయితీ జరిగిన మాట వాస్తవమే. చివరి వరకు జనసేన అభ్యర్థికి అవకాశం ఉంటుందని అనుకున్నా.. సాధ్యపడలేదు. తిరుపతిలో పవన్ పర్యటన చేసి ఓ అంచనాకు వచ్చినా, సామాజిక వర్గ ఓట్లపై లెక్కలు వేసుకున్నా, ఢిల్లీ టూర్ తో ఒత్తిడి పెంచినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బీజేపీ తరపున రత్నప్రభ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ-జనసేన మధ్య విభేదాలు పెరిగాయనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, అభ్యర్థి రత్నప్రభ, జనసేనానితో ప్రత్యేకంగా భేటీ కావడం విశేషం. బీజేపీ కీలకనేతలు, జనసేన కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. పవన్ కల్యాణ్ ని ప్రచారానికి రమ్మని పిలిచానని, ఆయన సానుకూలంగా స్పందించారని రత్నప్రభ తన ట్విట్టర్ లో పేర్కొంటే.. జనసేన తరపున మాత్రం అలాంటి హామీలేవీ బయటకు రాలేదు. ఉమ్మడి అభ్యర్థి జనసేనానిని కలిశారని, ఉమ్మడి కార్యాచరణపై చర్చించామని మాత్రమే జనసేన ట్వీట్ చేసింది.
పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటారు. గతంలో కేంద్రం చేసిన ఏ ప్రకటన అయినా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలుగు ప్రజల ముందుకు తెచ్చేవారు. కరోనా టైమ్ లో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన ఎందుకో మౌనంగా ఉన్నారు. రత్నప్రభ అభ్యర్థిత్వం ఖరారయిన తర్వాత పవన్ ఓ ట్వీట్ కూడా వేయలేదు. కనీసం జనసేన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లనుంచి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. తీరా ఇప్పుడు తనని కలవడానికి వచ్చిన రత్నప్రభకి పుష్పగుచ్ఛం ఇచ్చి పంపించారు పవన్ కల్యాణ్. పవన్ ప్రచారానికి వస్తారంటూ.. బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నా.. జనసేనాని నోరు విప్పలేదు.
ప్రకటన ఇస్తారా.. ప్రచారానికి వెళ్తారా..?
బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభని గెలిపించాలంటూ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ సందేశం ఇచ్చి సరిపెడతారా లేక ప్రచార బరిలో దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో బీజేపీ-జనసేన కూటమి బాగా వెనకబడి ఉంది. అభ్యర్థి ఖరారయిన తర్వాత కూడా స్పీడ్ పెంచకపోతే క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రచారంతో రత్నప్రభ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని చెప్పలేం కానీ, రెండో స్థానానికి అయినా పోటీ ఇవ్వగలుగుతారు. టీడీపీకి అసలు సిసలు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగినట్టవుతుంది. అందుకే ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ ప్రచారానికొస్తే ఆ జోరు వేరుగా ఉంటుంది. ఆయన నేరుగా రంగంలోకి దిగకపోతే.. బీజేపీ పరాజయానికి అదే తొలిమెట్టు అవుతుంది.