తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరుని ఖరారు చేశారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 1981 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రత్నప్రభ కర్నాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కర్నాటక ఒకేషనల్ స్కిల్స్ అథారిటీ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరిన ఆమెను ఇప్పుడు […]

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరుని ఖరారు చేశారు. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 1981 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రత్నప్రభ కర్నాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కర్నాటక ఒకేషనల్ స్కిల్స్ అథారిటీ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరిన ఆమెను ఇప్పుడు తిరుపతి బరిలో దింపారు.
తనని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సహా.. ఇతర నేతలందరికీ ఆమె ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి రుణపడి ఉంటానని, కొత్త ప్రయాణం మొదలైందని చెప్పారు. దేవుడు తనకు బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడని, ఇకపై తిరుపతికోసం, తిరుపతి ప్రజలకోసం శక్తివంచనలేకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
జనసేన ఆమోదంకోసమే ఆగారా..?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో అభ్యర్థి ప్రకటనపై బీజేపీ చాలాకాలంగా ముందడుగు వేయలేదు. జనసేనను మెల్లగా పోటీలోనుంచి తప్పించి, ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేస్తారని ప్రకటించేందుకే వారికి చాలా టైమ్ పట్టింది. దాదాపుగా రత్నప్రభ పేరు గతంలోనే ఖరారైంది. అయితే ఆమె జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతారని అనుకున్నారంతా. బీజేపీ నాయకురాలే అయినా.. జనసేనలో చేరి తిరుపతి బరిలో ఉంటారని అంచనా వేశారు. కానీ చివరకు బీజేపీ తరపునే ఆమె తిరుపతి ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. జనసేన కూడా రత్నప్రభ అభ్యర్థిత్వంపై పూర్తి నమ్మకంతో ఉండటంతో బీజేపీ ఆమె పేరు ఖరారు చేసింది.
ఇకపై ప్రచార జోరు..
ఇప్పటి వరకూ అభ్యర్థి తేలకపోవడంతో తిరుపతి ప్రచార బరిలో బీజేపీ-జనసేన కూటమి కాస్త వెనకంజలో ఉంది. అభ్యర్థిని అనౌన్స్ చేశారు కాబట్టి.. నామినేషన్ తో మొదలు పెట్టి ప్రచార హోరు ప్రారంభించడానికి బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కూడా తిరుపతి ప్రచారానికి వస్తారని అంటున్నారు. ప్రచారంలో పవన్ కనిపించకపోతే, జనసైనికులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే ఆయన్ని తిరుపతి తీసుకురావాలని చూస్తున్నారు. కేంద్ర నాయకత్వం కూడా ఒకటి రెండుసార్లు తిరుపతి వచ్చే అవకాశాలున్నాయి. వారితోపాటే పవన్ కూడా ప్రచార పర్వంలో భాగస్వామి అవుతారు. బీజేపీకి ఓటేయాలని తిరుపతి ప్రజల్ని అభ్యర్థిస్తారు.