సుప్రీంకోర్టు సీజేగా ఎన్వీ రమణ ఎంపిక లాంఛనమే..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక లాంఛనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియార్టీ ప్రకారం ఎన్వీ రమణ తదుపరి చీఫ్ జస్టిస్ అవుతారని అనుకుంటున్న సమయంలో ఏపీ సీఎం జగన్, ఆయనపై ఆరోపణలు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డేకు గతంలో రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఆ లేఖ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఎం జగన్ రాసిన లేఖ ఆధారంగా చర్యలు తీసుకుంటారని ఓ వర్గం భావిస్తే, అసలు సుప్రీం […]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ ఎంపిక లాంఛనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియార్టీ ప్రకారం ఎన్వీ రమణ తదుపరి చీఫ్ జస్టిస్ అవుతారని అనుకుంటున్న సమయంలో ఏపీ సీఎం జగన్, ఆయనపై ఆరోపణలు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డేకు గతంలో రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఆ లేఖ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఎం జగన్ రాసిన లేఖ ఆధారంగా చర్యలు తీసుకుంటారని ఓ వర్గం భావిస్తే, అసలు సుప్రీం కోర్టు జడ్జిపై ఆరోపణలు చేసినందుకు జగన్ పై చర్యలు తీసుకోవాలని మరో వర్గం వాదించింది. జగన్ రాసిన లేఖపై అంతర్గత విచారణ చేపడుతున్నట్టు సుప్రీంకోర్టు ఆమధ్య ప్రకటించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఆ విచారణ పూర్తయినట్టు, ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా సీఎం జగన్ రాసిన లేఖలోని ఆరోపణలను పక్కనపెట్టేసినట్టు సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పేరుని సిఫార్సు చేస్తూ న్యాయశాఖ మంత్రికి బోబ్డే లేఖ రాయడంతో ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది.
సీనియార్టీయే ప్రాతిపదిక..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే సీనియార్టీని పక్కనపెట్టి చీఫ్ జస్టిస్ నియామకాన్ని చేపట్టారు. ఇందిరాగాంధీ హయాంలో మాత్రమే ఆనవాయితీకి తిలోదకాలిచ్చి సీనియార్టీ లేకపోయినా, ఆమెకు నచ్చినవారిని చీఫ్ జస్టిస్ లుగా చేశారు. ప్రస్తుత సీజే ఎస్ఏ బోబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో ముగుస్తుంది. అంతకు నెలరోజుల ముందుగానే తదుపరి సీజేపై న్యాయశాఖకు సిఫార్సు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లాంఛనం బోబ్డే పూర్తి చేశారు. ఎన్వీరమణ పేరుని ప్రతిపాదించారు. బోబ్డే లేఖను న్యాయశాఖ పరిశీలించి ప్రధాని ఆమోదానికి పంపుతుంది. ఆయన దానిపై చర్చించి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త సీజే నియామక ప్రక్రియ పూర్తవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జస్టిస్ రమణ ఏప్రిల్ 24న సుప్రీం చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ పదవిలో ఆయన 16 నెలల పాటు ఉంటారు. సుప్రీంకోర్టు 9వ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన కోకా సుబ్బారావు తర్వాత దాదాపు ఐదున్నర దశాబ్దాలకు మరో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ ఆ స్థానాన్ని అందుకోబోతున్నారు.