Telugu Global
NEWS

టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వండి..

“టీటీడీ ఒక ధార్మిక సంస్థ, ప్రైవేట్‌ ట్రస్ట్‌ కాదు. అది లాభాపేక్షతో ఏర్పడిన సంస్థ అంతకంటే కాదు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందించే సేవలు, కల్పించే సౌకర్యాలపై కూడా ఎడాపెడా జీఎస్టీ విధించడం ఏ విధంగా సమంజసం” అని రాజ్యసభలో ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. హిందువుల పార్టీగా తమను తాము అభివర్ణించుకునే బీజేపీ తిరుమలలో కొలువైన శ్రీవారి పట్ల ఎందుకంత వివక్ష ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. […]

టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వండి..
X

“టీటీడీ ఒక ధార్మిక సంస్థ, ప్రైవేట్‌ ట్రస్ట్‌ కాదు. అది లాభాపేక్షతో ఏర్పడిన సంస్థ అంతకంటే కాదు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందించే సేవలు, కల్పించే సౌకర్యాలపై కూడా ఎడాపెడా జీఎస్టీ విధించడం ఏ విధంగా సమంజసం” అని రాజ్యసభలో ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. హిందువుల పార్టీగా తమను తాము అభివర్ణించుకునే బీజేపీ తిరుమలలో కొలువైన శ్రీవారి పట్ల ఎందుకంత వివక్ష ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. టీటీడీకి జీఎస్టీనుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఏటా సగటున 120 కోట్ల రూపాయలను జిఎస్టీ కింద టీటీడీ చెల్లిస్తోందని, అందులో కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్‌ పుట్‌ క్రెడిట్‌ కింద వెనక్కి ఇస్తున్నారని, అంటే.. ప్రతి ఏటా.. 111 కోట్ల రూపాయలమేర జీఎస్టీ ద్వారా టీటీడీ ఆదాయానికి కోత పడుతోందని వివరించారు. జీఎస్టీ ప్రవేశ పెట్టక ముందు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీతో సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలకు పన్నుల నుంచి మినహాయింపు కల్పించిందని గుర్తు చేశారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత భక్తులకు కల్పించే సౌకర్యాలు, సేవలపై కూడా భారీగా జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై జీఎస్టీ మినహాయింపు ఉన్నా వాటి తయారీకి వినియోగించే పదార్ధాలపై మాత్రం జీఎస్టీ వసూలు చేయడం దారుణం అని విమర్శించారు. తిరుమల కాటేజీలలో కూడా హోటళ్లతో సమానంగా జీఎస్టీ వసూలు చేయడం సరికాదని చెప్పారు.

కరెన్సీ, నాణేల సమస్యలకు పరిష్కారం చూపండి..
టీటీడీ వద్ద పేరుకుపోతున్న విదేశీ కరెన్సీ, నాణేల నిల్వలు వంటి పలు సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా కోరారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే పలు విన్నపాలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూకూర్ ‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్ లో కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు కావొస్తున్నా రైల్వే జోన్ విషయాన్ని పట్టించుకోలేదని, వాల్తేరు డివిజన్‌ ను అలాగే ఉంచి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విభజన హామీలపై దృష్టిపెట్టాలని రైల్వే మంత్రిని కోరారు.

పోలవరం నిధుల సంగతేంటి..
పోలవరం నిర్మాణానికి సంబంధించి సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినా కూడా.. సవరించిన అంచనా మొత్తం 55,656 కోట్ల రూపాయలకు ఇంకా అనుమతి రాలేదని చెప్పారు విజయసాయిరెడ్డి. ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని కోరారు. విశాఖ కేంద్రంగా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (కాట్‌)ను ఏర్పాటు చేయాలని, మిత్రా పథకం కింద కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ లను అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్‌ ఇన్ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు.

గిరిజనులను ఆదుకోండి..
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కాఫీ ఫ్లాంటేషన్ పనులను ఉపసంహరించడం వల్ల ఏపీలో లక్షమంది గిరిజనులు నష్టపోతున్నట్టు వివరించారు విజయసాయిరెడ్డి. గిరిజన రైతులు ఎకరాకు 15 వేల రూపాయల వరకు నష్టపోతున్నారని, వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. కాఫీ ప్లాంటేషన్ ‌లలో ఉపాధి హామీ పనులు తిరిగి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ కు 26.17 కోట్లు..
శాలిహుండం-తొట్లకొండ-బొజ్జనకొండ-అమరావతి-అనుపు ప్రాంతాల్లోని ప్రాచీన బౌద్ద కట్టడాలను కలుపుతూ రూపొందించిన బుద్దిస్ట్ సర్క్యూట్ కి 26.17 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిచ్చారు. మొత్తం 52.34 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్ట్‌ ను అమలు చేస్తున్న ఏజెన్సీకి 26.17 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రాచీన బౌద్ద కట్టడాలు ఉన్న ప్రాంతాలలో పర్యాటకులకోసం పార్కింగ్‌ సౌకర్యాలు, సాంస్కృతిక కేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్రాచీన కట్టడాలకు లైటింగ్‌, సీసీటీవీ, వైఫై సౌకర్యాలను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

First Published:  23 March 2021 4:37 PM IST
Next Story