ఈటల మాటల ‘మంటలు’ దేనికి సంకేతం?
ఇటీవల తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొంది.. ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతుండగా మంత్రి ఈటల రాజేందర్ సడెన్‌గా బాంబు పేల్చారు. డబ్బు, కులం కాదు మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా వ్యంగ్యంగా మాట్లాడారు .. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి స్కీమ్స్ పై […]

ఇటీవల తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపొంది.. ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతుండగా మంత్రి ఈటల రాజేందర్ సడెన్‌గా బాంబు పేల్చారు. డబ్బు, కులం కాదు మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా వ్యంగ్యంగా మాట్లాడారు .. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి స్కీమ్స్ పై మాట్లాడుతూ.. ‘పరిగే ఏరుకోవడం కాదు.. పంట పండించుకోగలగాలి’ అంటూ నర్మ గర్భంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈటల ప్రకటనలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నది.
ఆరోగ్యమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎందుకు ఇలా మాట్లాడారో? ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే కొంతకాలంగా ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్‌కు గ్యాప్ వచ్చినట్టు సమాచారం. గతంలో ఇటువంటి వార్తలు వచ్చాయి. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి అసలైన ఓనర్లము మేమే అంటూ కూడా ఈటల సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే తాజా ప్రకటనలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు ఈటల రాజేందర్‌ను ఆహ్వానించలేదని సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను కూడా ఈటలకు అప్పగించలేదట. దీంతో ఆయన నొచ్చుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ త్వరలో టీఆర్ఎస్ ను వీడబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన మంత్రివర్గంలోనుంచి తప్పుకోబోతున్నారంటూ చర్చ నడుస్తున్నది. అయితే గతంలోనే ఇటువంటి ఆరోపణలే రాగా సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి .. ఈటలను బుజ్జగించారు. నిజానికి కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్‌కు కేసీఆర్ క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు. అక్కడ ఈటలకు, గంగులకు మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. గంగులకు మంత్రి పదవి ఇవ్వడం.. జిల్లాలోని ముఖ్యమైన బాధ్యతలన్నీ అతడికే అప్పగించడంతో ఈటల మనస్తాపానికి గురయినట్టు సమాచారం.
తొలి నుంచి కేసీఆర్ వెంట నడిచి .. ఉద్యమంలో పాల్గొన్న తనను కాదని.. టీడీపీ నుంచి వచ్చిన గంగుల కమలాకర్‌ను భుజాల మీదకు ఎత్తుకోవడం ఈటలకు అస్సలు నచ్చడం లేదని సమాచారం. మరోవైపు కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోనూ ఈటలకు కొన్ని విబేధాలు ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే ఈ వివాదానికి త్వరలోనే ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.