రాజీనామా లేదు.. రాజీయే..
100 కోట్ల రూపాయల వసూళ్ల టార్గెట్ తో విమర్శల పాలయిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా వ్యవహారం తేలిపోయింది. అనిల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవేనని చెప్పిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. 24గంటలు తిరిగే లోగా ఆరోపణలు అవాస్తవం అని తేల్చి చెప్పారు, రాజీనామా అవసరం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న పరమ్ వీర్ సింగ్ వాదనలో నిజం లేదని సాక్ష్యాధారాలు కూడా చూపిస్తున్నారు పవార్. వాజే అనే పోలీస్ […]
100 కోట్ల రూపాయల వసూళ్ల టార్గెట్ తో విమర్శల పాలయిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా వ్యవహారం తేలిపోయింది. అనిల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవేనని చెప్పిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. 24గంటలు తిరిగే లోగా ఆరోపణలు అవాస్తవం అని తేల్చి చెప్పారు, రాజీనామా అవసరం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న పరమ్ వీర్ సింగ్ వాదనలో నిజం లేదని సాక్ష్యాధారాలు కూడా చూపిస్తున్నారు పవార్. వాజే అనే పోలీస్ అధికారి ఫిబ్రవరిలో అనిల్ దేశ్ ముఖ్ ఇంటికి వెళ్లి కలిశారని పరమ్ వీర్ అనే మరో అధికారి ఆరోపించారు. అయితే ఫిబ్రవరిలో మంత్రి అనిల్ కరోనాతో చికిత్స తీసుకున్నారని ఆ నెల మొత్తం ఆస్పత్రిలోనో లేదా హోమ్ క్వారంటైన్లోనో ఉన్నారని దానికి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు శరద్ పవార్, పరమ్ వీర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. అనిల్ రాజీనామా చేయాలనడం సరికాదని, ఆ అవసరం లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు ప్రతిపక్ష బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం పవార్ వాదనని కొట్టిపారేశారు. ఫిబ్రవరిలో మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడిన ఓ వీడియోని, ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మొత్తమ్మీద కూటమిలో కలకలం రేపుతుంది అనుకున్న రాజీనామా వ్యవహారాన్ని శరద్ పవార్ తేలిగ్గా తీసి పక్కనపెట్టారు. అనిల్ రాజీనామా వ్యవహారంపై మిత్రపక్షం శివసేన ఒత్తిడి తమపై లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. హోం మంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని, కొత్త మార్గాన్ని అణ్వేషిస్తున్నామని, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని.. ప్రకటన చేసి కలకలం రేపిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా వెనక్కి తగ్గారు. దీంతో ఒకరకంగా మహా వికాస్ అఘాడీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిపోయింది.
పరమ్ వీర్ మెడకు ఉచ్చు..
హోం మంత్రి అనిల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన పోలీస్ అధికారి పరమ్ వీర్ మెడకు అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. హోం మంత్రిపై పరమ్ వీర్ 100కోట్ల ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే.. పరమ్ వీర్ గతంలో తన బదిలీని ఆపేందుకు 2 కోట్లు లంచం అడిగారంటూ.. ముంబై పోలీస్ ఇన్ స్పెక్టర్ అనూప్ డాంగే కొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చారు. మరోవైపు పరమ్ వీర్ తన బదిలీ వ్యవహారంపై సుప్రీంకోర్టుని అశ్రయించారు. తనను పోలీస్ కమిషనర్ స్థానం నుంచి హోం గార్డ్స్ విభాగానికి బదిలీ చేయడం సరికాదని, దాన్ని రద్దు చేయాలని ఆయన సుప్రీంలో పిటిషన్ వేశారు. మొత్తమ్మీద.. అంబానీ ఇంటి ముందు కార్ పార్కింగ్ దగ్గరనుంచి మొదలైన ఈ వ్యవహారం.. హోం మంత్రి ముడుపులు, పోలీసుల వసూళ్ల వరకు వచ్చి ఆగింది.