ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తిన విజయసాయిరెడ్డి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తారు విజయసాయిరెడ్డి. గనులు, ఖనిజాల అభివృద్ధి,, నియంత్రణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారాయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా వర్థిల్లుతున్న స్టీల్ ప్లాంట్ ను ఒక్క కలంపోటుతో ప్రైవేటీకరించాలనే నిర్ణయం సరికాదని అన్నారు. ప్లాంట్ పునరుద్ధరణకు ప్రణాళికలు రచించాల్సింది పోయి, ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూడటం సరికాదని అన్నారు. […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తారు విజయసాయిరెడ్డి. గనులు, ఖనిజాల అభివృద్ధి,, నియంత్రణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారాయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా వర్థిల్లుతున్న స్టీల్ ప్లాంట్ ను ఒక్క కలంపోటుతో ప్రైవేటీకరించాలనే నిర్ణయం సరికాదని అన్నారు. ప్లాంట్ పునరుద్ధరణకు ప్రణాళికలు రచించాల్సింది పోయి, ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూడటం సరికాదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాయని, ప్రైవేటుకి అప్పగిస్తే లాభార్జనే వాటి ధ్యేయం అవుతుందని అన్నారు.
సవరణ బిల్లులోని అంశాలపై ధ్వజం..
నిర్ణీత కాలపరిమిలో రాష్ట్ర ప్రభుత్వం గనులను వేలం వేయలేకపోతే.. ఆ హక్కు కేంద్రానికి దఖలు పడేలా సవరణ బిల్లు ఉండటాన్ని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. నిర్ణీత కాల పరిమితికి లోబడి ఎక్కడా ఏ పనులు జరగడంలేదని, రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లవుతున్నా.. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు కాలేదని అన్నారు. విశాఖ రైల్వేజోన్ హామీని ఇంతవరకు కేంద్రం అమలు చేయలేదని, అలాగని.. ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు కింద కేంద్ర, రాష్ట్రాల అధికారాల మధ్య స్పష్టమైన విభజన జరిగిందని, ఒకరి అధికారాలను మరొకరు హరించడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు.
వాణిజ్యపరమైన అవసరాల కోసం ప్రైవేట్ సంస్థలకు గనుల కేటాయింపు జరగడానికి వీలుగా సవరణ బిల్లు ఉందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ హక్కులు కట్టబెట్టడంలో తప్పులేదని, కానీ ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించిన తర్వాతే మిగిలిన వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్నారు. సవరణ బిల్లు యథాతథంగా ఆమోదం పొందితే 50 మైనింగ్ బ్లాక్ లు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళతాయని, బ్లాక్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందని గుర్తు చేశారు. పవర్ ప్లాంట్‌ల నుంచి రావల్సిన 17 వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టి కోల్ ఇండియాను గట్టెక్కించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
కోకింగ్ కోల్ కొరతపై ప్రశ్నించిన విజయసాయి..
సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా అంటూ బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ని విజయసాయిరెడ్డి సభలో ప్రశ్నించారు. దానికి సమాధానమిచ్చిన మంత్రి.. స్టీల్ ప్లాంట్‌లకు కోకింగ్ కోల్ కొరత ఉందని అంగీకరించారు. ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటన్నట్లు చెప్పారాయన. స్టీల్ ప్లాంట్లకు అవసరమయ్యే కోకింగ్ కోల్ దేశంలో తగినంత పరిణామంలో అందుబాటులో లేదని చెప్పారు మంత్రి. బూడిద తక్కువగా ఉండే లోయాష్ కోకింగ్ కోల్ ను అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమ బొగ్గు అవసరాల కోసం ఈ-వేలంలో పాల్గొనవచ్చని అన్నారు.
చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఊతమిచ్చేలా ఉన్న గనులు, ఖనిజాల అభివృద్ధి,, నియంత్రణ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలంతా సభ నుంచి వాకౌట్ చేశారు.