Telugu Global
National

నందిగ్రామ్ చుట్టూ బెంగాల్ రాజకీయాలు..

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మొత్తం పశ్చిమ బెంగాల్ రాజకీయాలకంటే ఎక్కువగా నందిగ్రామ్ పైనే ఫోకస్ పెట్టారు. విజయంపై ధీమాతో ఆమె సొంత నియోజకవర్గం వదిలిపెట్టి మరీ కేవలం నందిగ్రామ్ లోనే నామినేషన్ వేశారు. తనకి నమ్మినబంటుగా ఉంటూ.. చివరి నిముషంలో పార్టీ మారి ఇబ్బంది పెట్టిన సువేందు అధికారిపై ఆమె ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నందిగ్రామ్ నామినేషన్ ఘట్టం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. నామినేషన్ వేసి తిరిగొస్తూ మమత గాయపడటంతో, చక్రాల కుర్చీతోనే […]

నందిగ్రామ్ చుట్టూ బెంగాల్ రాజకీయాలు..
X

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మొత్తం పశ్చిమ బెంగాల్ రాజకీయాలకంటే ఎక్కువగా నందిగ్రామ్ పైనే ఫోకస్ పెట్టారు. విజయంపై ధీమాతో ఆమె సొంత నియోజకవర్గం వదిలిపెట్టి మరీ కేవలం నందిగ్రామ్ లోనే నామినేషన్ వేశారు. తనకి నమ్మినబంటుగా ఉంటూ.. చివరి నిముషంలో పార్టీ మారి ఇబ్బంది పెట్టిన సువేందు అధికారిపై ఆమె ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నందిగ్రామ్ నామినేషన్ ఘట్టం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. నామినేషన్ వేసి తిరిగొస్తూ మమత గాయపడటంతో, చక్రాల కుర్చీతోనే ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు.

సువేందుపై విజయం సులభమేనా..?
నందిగ్రామ్ సీటు టీఎంసీదే అయినా.. అక్కడ సువేందు అధికారి కుటుంబానికి పలుకుబడి ఎక్కువ. ఇప్పుడు బీజేపీ బలం కూడా తోడవడంతో ఆ సీటుని ఎలాగైనా గెలిచి తీరతానంటున్నారు సువేందు. మరోవైపు.. మమత కూడా నందిగ్రామ్ సవాల్ నెగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సువేందు అధికారి కుటుంబంపై ఆమె తొలిసారిగా తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘ఈ విషయంలో తప్పంతా నాదే, నిజం తెలుసుకోలేకపోయిన నేను ఓ పెద్ద గాడిదను. ఇన్నాళ్లూ వారి నిజస్వరూపం తెలుసుకోలేకపోయా. 5వేల కోట్ల రూపాయలతో పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్న సువేందు కుటుంబం.. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను కొంటారు. అలాంటి వారికి ఓటేయకండి’’ అని ఓటర్లకు మమత విజ్ఞప్తి చేశారు. అధికారి కుటుంబాన్ని ద్రోహులుగా అభివర్ణించారామె.

మమతకు మరింత గడ్డుకాలం..
ఎన్నికలకు ముందు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నా మమతా బెనర్జీ వెనక్కి తగ్గలేదు. అయితే తాజాగా సువేందు అధికారి తండ్రి టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి కూడా ఆ పార్టీని వీడారు. ఆదివారం ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మమతపై తన కొడుకు సువేందు కచ్చితంగా గెలిచి తీరుతారని అన్నారు శిశిర్. కుటుంబం అంతా ఒకేవైపు ఉండటంతో.. నందిగ్రామ్ లో మమతా బెనర్జీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకూ వెల్లడైన ప్రీ పోల్ సర్వేలన్నీ మమతా బెనర్జీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే ఆ సర్వేల ఫలితాల తర్వాత బీజేపీ వలస నాయకులతో మరింత పటిష్టంగా మారింది. మిగతా రాష్ట్రాలకంటే బీజేపీ ఎక్కువగా బెంగాల్ పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు బెంగాల్ లో పర్యటించారు. అమిత్ షా దాదాపుగా అక్కడే తిష్టవేసి టీఎంసీ నాయకుల్ని లాగేసుకుంటూ మమత పార్టీని బలహీన పరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ లో మళ్లీ టీఎంసీ జెండా ఎగురుతుందా, నందిగ్రామ్ లో మమత విజయం సాధిస్తుందా.. అనే ప్రశ్నలు కొత్తగా ఉత్పన్నం అవుతున్నాయి.

First Published:  22 March 2021 2:33 AM IST
Next Story