ఎవరీ తీన్మార్ మల్లన్న..!
నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికతో తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. గణనీయమైన ఓట్లు సాధిస్తూ.. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చమటలు పట్టించారు. విపరీతమైన ఓటు షేర్ సాధించారు. ఓ స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో క్రేజ్ దక్కడానికి కారణం ఏమిటి? అసలు తీన్మార్ మల్లన్న వెనుక ఎవరైనా ఉన్నారా? అతడి రాజకీయ నేపథ్యం ఏమిటి? తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ పుట్టిన ఊరు. యాదాద్రి […]
నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికతో తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. గణనీయమైన ఓట్లు సాధిస్తూ.. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చమటలు పట్టించారు. విపరీతమైన ఓటు షేర్ సాధించారు. ఓ స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో క్రేజ్ దక్కడానికి కారణం ఏమిటి? అసలు తీన్మార్ మల్లన్న వెనుక ఎవరైనా ఉన్నారా? అతడి రాజకీయ నేపథ్యం ఏమిటి?
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ పుట్టిన ఊరు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం. అతడిదో నిరుపేద కుటుంబం. మల్లన్న తల్లిదండ్రులు వ్యవసాయం, వ్యవసాయ కూలి పనులు చేస్తుంటారు. ఉస్మానియాలో చదువుకున్న తీన్మార్ మల్లన్న.. ఓ టీవీ చానల్లో నిర్వహించిన ‘తీన్మార్’ అనే టీవీ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కూడా ఓ టీవీ చానల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కేవలం సోషల్‌మీడియానే నమ్మకున్నారు.
మల్లన్న ‘క్యూన్యూస్’ అనే ఓ చానల్‌ను ప్రారంభించి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజలకు చేరువయ్యారు. అంతేకాక మల్లన్న తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన న్యూస్ చదివే విధానం కూడా తెలంగాణ స్లాంగ్‌లో ఉంటుంది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అనతికాలంలోనే సదరు చానల్ క్రేజ్ తెచ్చుకున్నది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల మీద నేరుగా విమర్శలు చేయడంతో యువతలో ఫాలోయింగ్ వచ్చింది. వెరసి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గణనీయమైన ఓట్లు వచ్చాయి.
గతంలోనూ మల్లన్న పలుసార్లు ఎన్నికల్లో పోటీచేశారు. 2019లో హుజూరునగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అంతకుముందు నల్లగొండ స్థానానికే కాంగ్రెస్ తరఫున పోటీచేయగా 10వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం పకడ్బందీగా ఓ టీంను సిద్ధం చేసుకొని.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే నల్లగొండ లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.
ఏది ఏమైనా ఓ స్వతంత్ర అభ్యర్థి ప్రధానపార్టీలకు దీటుగా .. అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీఇవ్వడం అభినందనీయమే.