Telugu Global
National

దీదీ వర్సెస్ మోదీ.. వేడెక్కిన రాజకీయం..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమరం రోజు రోజుకీ రంజుగా మారుతోంది. మమతా బెనర్జీ కాలిగాయంతో చక్రాల కుర్చీనుంచే ప్రచార పర్వం మొదలు పెట్టింది. బీజేపీకి అవకాశమే లేకుండా ఉచితాలతో మేనిఫెస్టోకి బాగా మసాలా దట్టించింది. అటు సింపతీ, ఇటు హామీల వర్షం.. రెండింటినీ సమపాళ్లలో నడిపిస్తూ ముందుకెళ్తోంది దీదీ. ఇటు బీజేపీ కూడా అంతే దూకుడుమీదుంది. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అడ్డుపడుతున్నా.. బెంగాల్ లో పట్టుకోసం కమలదళం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కోల్ […]

దీదీ వర్సెస్ మోదీ.. వేడెక్కిన రాజకీయం..
X

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమరం రోజు రోజుకీ రంజుగా మారుతోంది. మమతా బెనర్జీ కాలిగాయంతో చక్రాల కుర్చీనుంచే ప్రచార పర్వం మొదలు పెట్టింది. బీజేపీకి అవకాశమే లేకుండా ఉచితాలతో మేనిఫెస్టోకి బాగా మసాలా దట్టించింది. అటు సింపతీ, ఇటు హామీల వర్షం.. రెండింటినీ సమపాళ్లలో నడిపిస్తూ ముందుకెళ్తోంది దీదీ. ఇటు బీజేపీ కూడా అంతే దూకుడుమీదుంది. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అడ్డుపడుతున్నా.. బెంగాల్ లో పట్టుకోసం కమలదళం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కోల్ కతాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రారంభించిన మోదీ.. 15రోజుల లోపే మరోసారి బెంగాల్ లో అడుగు పెట్టారు. పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ, దీదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కు పెట్టారు.

‘ఖేలా హోబె.. వికాస్ హోబె’..
ఇటీవల చక్రాల కుర్చీతో ప్రచారానికి వస్తున్న దీదీ ఖేలా హోబె అనే మాటని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. కట్టు కట్టుకుని ఉన్న ఆమె కాలు కింద ఫుట్ బాల్ బొమ్మ పెట్టి సోషల్ మీడియాలో ఈ స్లోగన్ ని బాగా ప్రచారం చేస్తున్నాయి టీఎంసీ శ్రేణులు. దీనికి రిటార్ట్ గా ప్రధాని మోదీ వికాస్ హోబె అనే స్లోగన్ తెరపైకి తెచ్చారు. ‘ఖేలా హోబె(ఆట మొదలైంది)’ అని దీదీ పదే పదే చెబుతున్నారని, కానీ బీజేపీ మాత్రం ‘వికాస్‌ హోబె'(అభివృద్ధి మొదలైంది) అని అంటోందని చెప్పారు మోదీ. ‘ఖేలా శేష్‌ హోబె’, ‘వికాస్‌ ఆరంభ్‌ హోబె’ ( ఆటకు ముగింపు మొదలైంది – అభివృద్ధికి ఆరంభం మొదలైంది ) అని మోదీ కొత్త నినాదాన్నిచ్చారు.

టీఎంసీపై మోదీ మార్కు చెణుకులు..
ఏ రాష్ట్రానికి వెళ్తే, అక్కడి స్థానిక భాషలో మాట్లాడి ఆకట్టుకోవడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. పశ్చిమబెంగాల్ ప్రచార పర్వంలో మోదీ బెంగాలీలో మాట్లాడుతూ అబ్బురపరిచారు. తృణమూల్ కాంగ్రెస్ కి కొత్త అర్థాన్ని చెప్పారు. టీఎంసీ అంటే ‘ట్రాన్స్‌ ఫర్‌ మై కమిషన్‌’ పార్టీ అని పార్టీ ఎద్దేవా చేశారు మోదీ. మాది కట్ మనీ ప్రభుత్వం కాదని, డీబీటీ ప్రభుత్వం అని చెప్పారు. దీదీ హయాంలో కట్‌ మనీ(కమిషన్‌) లేనిదే ఏ పని జరగదని, కానీ బీజేపీ మాత్రం డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్నే విశ్వసిస్తుందని తెలిపారు. సుదీర్ఘకాలంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజలను అణగదొక్కిందని.. ఇప్పుడు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో వారికి ఓటమి తప్పదని అన్నారు మోదీ.

కోట్లాది మంది భారత పుత్రికల్లాగే దీదీ కూడా మాకు కుమార్తె లాంటిది, ఆమె అంటే మాకు ఎప్పటికీ గౌరవమే, అందుకే ఆమెకు గాయమైనప్పుడు మేం ఆందోళన చెందాం, ఆమె కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ముక్తాయించారు మోదీ.

First Published:  18 March 2021 12:02 PM IST
Next Story