Telugu Global
NEWS

తిరుపతిపై టీడీపీ చేతులెత్తేసినట్టే..?

తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నాయి కానీ టీడీపీలో కదలికలేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకు హడావిడి లేకుండా ఉన్న వైసీపీలో మాత్రం అన్నీ చకచకా జరుగుతున్నాయి. మెజార్టీపై మంత్రులు, ఎమ్మెల్యేలు టార్గెట్లు ఫిక్స్ చేసేశారు. మంత్రి పెద్దిరెడ్డి 3లక్షలంటే, ఎమ్మెల్యే ఆనం మూడున్నర లక్షలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి గురుమూర్తి వెళ్లి సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా మున్సిపల్ మూడ్ లోనుంచి బయటికొచ్చేసి ప్రచార బాధ్యతలు కిందిస్థాయి నేతలకు […]

తిరుపతిపై టీడీపీ చేతులెత్తేసినట్టే..?
X

తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నాయి కానీ టీడీపీలో కదలికలేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకు హడావిడి లేకుండా ఉన్న వైసీపీలో మాత్రం అన్నీ చకచకా జరుగుతున్నాయి. మెజార్టీపై మంత్రులు, ఎమ్మెల్యేలు టార్గెట్లు ఫిక్స్ చేసేశారు. మంత్రి పెద్దిరెడ్డి 3లక్షలంటే, ఎమ్మెల్యే ఆనం మూడున్నర లక్షలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి గురుమూర్తి వెళ్లి సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యేలంతా మున్సిపల్ మూడ్ లోనుంచి బయటికొచ్చేసి ప్రచార బాధ్యతలు కిందిస్థాయి నేతలకు అప్పగించేస్తున్నారు. వాస్తవానికి ఈ హడావిడి అంతా టీడీపీ చేయాల్సింది.

అసలు తిరుపతి ఉప ఎన్నికలకు ముందుగా అభ్యర్థిని ప్రకటించింది కూడా ఆ పార్టీయే. కేంద్ర మాజీ మంత్రి, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన పనబాక లక్ష్మినే ఉప ఎన్నికలకు కూడా ఫిక్స్ చేశారు చంద్రబాబు. ఆపై ఆమె పోటీకి వెనకాడటం, కీలక నేతలు వెళ్లి బుజ్జగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా పనబాక లక్ష్మి ఎక్కడా తనని తాను అభ్యర్థిగా ప్రకటించుకోలేదు. తిరుపతి ఉప ఎన్నికల గురించి మాట్లాడలేదు. కనీసం మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఆమె హడావిడి చేయలేదు. పుర తీర్పుతో టీడీపీ డీలా పడ్డ తర్వాత ఆమె అభ్యర్థిత్వంపై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. అసలు పనబాక పోటీ చేస్తారా లేదా అనే ఆలోచనలు మొదలయ్యాయి.

ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక కు మహూర్తం కుదిరిన తర్వాత కూడా చంద్రబాబు సైలెంట్ గానే ఉన్నారు. మున్సిపల్ ఫలితాలు వచ్చిన రెండోరోజే ఈ ప్రకటన రావడంతో చంద్రబాబు స్పందించడానికి అవకాశమే లేకుండా పోయింది. నిన్న మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏలూరు వచ్చిన బాబు, పుర ఫలితాలపై మాట్లాడేేందుకు ఇష్టపడలేదు. ఓవైపు మున్సిపల్ ఫలితాలు, మరోవైపు అమరావతి భూ వ్యవహారంలో సీఐడీ నోటీసులతో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దశలో తిరుపతి ఉప ఎన్నికలకోసం ఆయన నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనిపించడంలేదు. అయితే టీడీపీలో ఆయనకు ప్రత్యామ్నాయం కూడా ఎవరూ లేరు. కనీసం లోకేష్ తిరుపతి బాధ్యత భుజానికెత్తుకుంటారని అనుకున్నా అది కుదరడంలేదు. దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. పనబాక లక్ష్మిపోటీకి సిద్ధంగా ఉన్నారో లేదో అన్న విషయం కూడా తేలకపోవడంతో స్థానిక నేతల్లో కూడా కదలిక లేదు. తిరుపతి సెగ్మెంట్ లోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల టీడీపీ నేతలు కూడా ఎక్కడా ఈ విషయంపై నోరు మెదపడంలేదు. దీంతో పోరాటానికి ముందుగానే టీడీపీ అస్త్ర సన్యాయం చేసిందనే విషయం అర్థమవుతోంది.

First Published:  18 March 2021 3:50 AM IST
Next Story