అధికారాంతమున చూడవలె..
అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్టు.. పదవీ విరమణ తేదీ దగ్గరపడేకొద్దీ నిమ్మగడ్డ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టారు నిమ్మగడ్డ. కోర్టుల చుట్టూ తిప్పించారు, చివాట్లు తినిపించారు. మంత్రుల్ని ఇల్లు కదలొద్దు, నోరు తెరవొద్దంటూ ఆంక్షలు విధించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి సైతం హైకోర్టు పర్మిషన్ కోరేలా చేశారు. చివరకు తన మాట నెగ్గించుకుని ఎన్నికలు జరిపించారు. ఆఖరకు పరిషత్ ఎన్నికల విషయంలో పేచీ పెట్టి […]
అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్టు.. పదవీ విరమణ తేదీ దగ్గరపడేకొద్దీ నిమ్మగడ్డ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టారు నిమ్మగడ్డ. కోర్టుల చుట్టూ తిప్పించారు, చివాట్లు తినిపించారు. మంత్రుల్ని ఇల్లు కదలొద్దు, నోరు తెరవొద్దంటూ ఆంక్షలు విధించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి సైతం హైకోర్టు పర్మిషన్ కోరేలా చేశారు. చివరకు తన మాట నెగ్గించుకుని ఎన్నికలు జరిపించారు. ఆఖరకు పరిషత్ ఎన్నికల విషయంలో పేచీ పెట్టి మౌనం దాల్చారు. ఇప్పుడాయన లెక్కలు సరిచేసేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమవుతోంది.
ప్రివిలేజ్ కమిటీ విచారణ..
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నానని, దౌర్జన్యాలు చేస్తున్నానని, తనపై ఆరోపణలు చేసి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డపై గతంలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తమ్మినేని సూచన మేరకు ప్రివిలేజ్ కమిటీ గతంలో సమావేశమై ఎస్ఈసీపై చర్యలు తీసుకోవచ్చని తేల్చింది. మంత్రి పెద్దిరెడ్డి రెండోసారి స్పీకర్ కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా దానికి సంబంధించి తాజా సమావేశం జరిగింది.
రెండోసారి జరిగిన ఈ సమావేశంలో ఎస్ఈసీని విచారణకు పిలిపించాలని నిర్ణయించింది ప్రివిలేజ్ కమిటీ. ముందుగా నిమ్మగడ్డ వివరణ కోరేందుకు నోటీసు ఇచ్చింది. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు పంపిచబోతున్నారు. ప్రివిలేజ్ కమిటీ విచారణకు అందుబాటులో ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నిమ్మగడ్డ నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. మొత్తమ్మీద నిమ్మగడ్డ వ్యవహారంలో పగడ్బందీగా ఉచ్చు బిగిసుకుంటున్నట్టు అర్థమవుతోంది. ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? నిమ్మగడ్డ పదవిలో ఉండగానే ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు అమలవుతాయా, పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.