Telugu Global
NEWS

రథ యాత్రా..? తీర్థ యాత్రా..?

సమకాలీన రాజకీయాల్లో రథయాత్రలకు కాలం చెల్లింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా రథయాత్రనే నమ్ముకున్నట్లుంది. తిరుపతి ఉప ఎన్నిక వేళ.. మరోసారి రథ యాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చింది. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు ఈ యాత్ర ఉంటుందని గతంలోనే ప్రకటించింది బీజేపీ. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేస్తున్న సమయంలో మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెస్తోంది కమలదళం. […]

రథ యాత్రా..? తీర్థ యాత్రా..?
X

సమకాలీన రాజకీయాల్లో రథయాత్రలకు కాలం చెల్లింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా రథయాత్రనే నమ్ముకున్నట్లుంది. తిరుపతి ఉప ఎన్నిక వేళ.. మరోసారి రథ యాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చింది. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు ఈ యాత్ర ఉంటుందని గతంలోనే ప్రకటించింది బీజేపీ. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేస్తున్న సమయంలో మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెస్తోంది కమలదళం. అయితే కపిలతీర్థం నుంచి మొదలయ్యే యాత్రను ప్రజలు స్వాగతిస్తారా, కనీసం విశాఖ వరకైనా వెళ్తుందా, అక్కడ నిరసనలతో ఆగిపోతుందా అనేది తేలాల్సి ఉంది. రామతీర్థం ఘటన పూర్తిగా ప్రజలు మరచిపోయిన వేళ.. ఆలయాల ఘటనల వెనక ప్రతిపక్షాల రాజకీయ దురుద్దేశాలు బయటపడుతున్న వేళ.. మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రథయాత్ర అవసరమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఓవైపు పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు, మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం, పాత బాకీలుగా మిగిలిపోయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు.. ఇవన్నీ ప్రతిబంధకాలుగా ఉన్నా కూడా తిరుపతిలో జనసేనను కాదని బీజేపీ ఆ స్థానానికి పోటీ పడుతోంది. తెలంగాణలో కలిసొచ్చిన అంశాలు ఇక్కడ కూడా తమను గట్టున పడేస్తాయని ఆశపడుతోంది. పదే పదే ఆలయాలపై దాడులు, మత మార్పిడులు, రథయాత్రలు అంటూ.. మతం పేరుతో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఇక్కడ అలాంటి పాచికలేవీ పారవు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ జ్ఞానోదయం బీజేపీకి అయ్యేంత వరకు ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా ఉండదు.

ప్రైవేటీకరణపై మా వాదన ఇదీ..
విజయవాడలో జరిగిన పదాధికారుల సమావేశంలో బీజేపీ నేతలు కీలక విషయాలపై తమదైన శైలిలో స్పందించారు. కడప స్టీల్‌ ప్లాంటును ప్రైవేటుకి అప్పగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్ ని మాత్రం ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనుకోవడం సరికాదని అన్నారు. అటు కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా బీజేపీ స్పందించింది. చేతనైతే తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను అక్కడి ప్రభుత్వమే నడపాలని, ఆ తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విశాఖకు బయ్యారం గనులివ్వాలని సూచించారు కూడా.

రథయాత్ర, మత మార్పిడుల పేరుతో తిరుపతి ఉప ఎన్నికలను మత రాజకీయాలకు లిట్మస్ టెస్ట్ గా వాడాలని చూస్తోంది బీజేపీ. స్థానిక సమస్యలు, రాష్ట్ర సమస్యలు.. వీటి ప్రస్తావన ఎక్కడా లేకుండా కేవలం మత మార్పిడులు, ఆలయాలపై దాడులు.. వీటినే ప్రధానంగా చూపించి హిందూ ఓట్లకు గాలం వేయాలనుకుంటున్నారు. తిరుపతిలో ఈ ప్లాన్ వర్కవుట్ అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే బీజేపీకి ప్రధాన అజెండాగా మారుతుంది. లేకపోతే ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి, మరో అజెండా భుజానికెత్తుకోవాల్సి ఉంటుంది.

First Published:  14 March 2021 2:52 AM IST
Next Story