Telugu Global
National

టార్గెట్ బీజేపీ.. స్టాలిన్ మేనిఫెస్టో మతలబు ఇదీ..

బీజేపీతో జతకలవడం అన్నాడీఎంకేకు బలమా, భారమా? ఈ విషయాన్ని స్టాలిన్ తేల్చేయబోతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థి అన్నాడీఎంకేను చిత్తు చేయడానికి బీజేపీని టార్గెట్ చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో.. వైరి వర్గాలను ఇరుకున పెట్టిందని అంటున్నారు విశ్లేషకులు. గ్యాస్ సిలిండర్ రేట్లపై రిబేటు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు స్టాలిన్. ఏకంగా సిలిండర్ కి రూ.100 రూపాయలు రాయితీ ఇస్తానన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా లీటర్ కి 5 […]

టార్గెట్ బీజేపీ.. స్టాలిన్ మేనిఫెస్టో మతలబు ఇదీ..
X

బీజేపీతో జతకలవడం అన్నాడీఎంకేకు బలమా, భారమా? ఈ విషయాన్ని స్టాలిన్ తేల్చేయబోతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థి అన్నాడీఎంకేను చిత్తు చేయడానికి బీజేపీని టార్గెట్ చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో.. వైరి వర్గాలను ఇరుకున పెట్టిందని అంటున్నారు విశ్లేషకులు. గ్యాస్ సిలిండర్ రేట్లపై రిబేటు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు స్టాలిన్. ఏకంగా సిలిండర్ కి రూ.100 రూపాయలు రాయితీ ఇస్తానన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా లీటర్ కి 5 రూపాయలు తగ్గింపు ఉంటుందన్నారు.

అన్నాడీఎంకే కూటమి ఈ హామీ ఇవ్వలేదా..?
దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాసి సిలిండర్ల రేట్లు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు ఆ మేరకు మిగిలిన సొమ్ముని తన జేబులో వేసుకున్న కేంద్రం, రేట్లు పెరిగినప్పుడు మాత్రం ప్రజలపై భారం వేసేసింది. 2 నెలల సమయంలోనే గ్యాస్ సిలిండర్ రేటు రూ.200 కి పైగా పెంచి ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. అయితే తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ ఇవ్వలేదు. ఎందుకంటే.. తమిళనాడుతోపాటు 3 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ హామీ ఇచ్చారంటే అక్కడ అడ్డంగా బుక్కయినట్టే.. పోనీ 4 ప్రాంతాలే కదా, ఓట్లకోసం సర్దుకు పోతామంటే కుదరదు, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా కేంద్రాన్ని టార్గెట్ చేస్తాయి. ఇప్పటికే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ తాయిలాలు విదిల్చిన కేంద్రం మరోసారి అదే రాష్ట్రాల్లో గ్యాస్ రాయితీ అందంటే మాత్రం లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకున్నట్టే. అంటే ఇన్నాళ్లూ బీజేపీ వట్టి డ్రామాలాడినట్టు తేలుపోతుంది. అందుకే గ్యాస్ రాయితీ, పెట్రోల్ రాయితీపై అన్నాడీఎంకే వర్గం నోరు మెదపలేదు. అది మినహా ఇంకెన్ని ఉచితాలు ప్రకటించినా ఈ దశలో వంటింటి ఓట్లు రాబట్టుకోవడం కష్టమే.

అంతే కాదు.. స్టాలిన్ మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు, ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టే పథకాలు చాలానే ఉన్నాయి. హిందూ ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు ప్రకటించిన నాస్తిక పార్టీ వారసుడు.. పరోక్షంగా బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో మసీదులు, చర్చిల పునరుద్ధరణకు కూడా చెరో వందకోట్లు కేటాయించి అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారంటే, తాను గెలిస్తే.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయం అని ముందే స్పష్టం చేసినట్టు అర్థమవుతోంది. తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు చేస్తామనడం కూడా సాహసోపేత నిర్ణయమే, కేంద్రంతో యుద్ధానికి దిగే ప్రయత్నమే. ఇక ఆస్తిపన్ను పెంపుని రద్దు చేస్తామనడం, మహిళలకు ప్రసూతి సెలవలు పెంచడం, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇస్తామనడం, జర్నలిస్ట్ లకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, మెట్రో రైలు ప్రాజెక్ట్ లు, లక్షమందికి తీర్థయాత్రలకు ఆర్థిక సాయం, లంకేయులకు తమిళ పౌరసత్వం, ఏపీలోఅన్న క్యాంటీన్లలాగా తమిళనాట కలైంగర్ క్యాంటీన్లు, కరోనాతో నష్టపోయిన వారికి రేషన్ కార్డు చూపిస్తే రూ.4వేలు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల కోటా 40శాతానికి పెంపు.. ఇలా స్టాలిన్ మేనిఫెస్టో అంతా ఆఫర్ల మయంగానే ఉంది. అదే సమయంలో ప్రత్యర్థుల్ని పూర్తిగా ఇరుకున పెట్టేలా కూడా ఉంది. దీనికి ధీటుగా అన్నాడీఎంకే కూటమి ఎలాంటి మేనిఫెస్టోని విడుదల చేస్తుందో చూడాలి. ఒకవేళ గ్యాస్ రాయితీ, పెట్రోలు రేట్ల సవరణ వంటి తేనె తుట్టెని కదిపారంటే మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీ తన మెడపై తానే కత్తి పెట్టుకున్నట్టు లెక్క.

First Published:  14 March 2021 2:28 AM IST
Next Story