దీదీపై దాడి.. బెంగాల్ లో వేడి..
పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయనే విషయం ముందుగానే తేలిపోయింది. ఈపాటికే మాటల యుద్ధం అక్కడ ఓ రేంజ్ లో మొదలైంది. ఇప్పుడు ఆ యుద్ధం చేతల వరకు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసిన మరుసటి రోజే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రిపై మమతా బెనర్జీపై దాడి జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ దాడి పేరుతో ఆమె రాజకీయ లబ్ధికోసం డ్రామా ఆడుతున్నారని, సెక్యూరిటీని దాటుకుని వెళ్లి […]
పశ్చిమబెంగాల్ లో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయనే విషయం ముందుగానే తేలిపోయింది. ఈపాటికే మాటల యుద్ధం అక్కడ ఓ రేంజ్ లో మొదలైంది. ఇప్పుడు ఆ యుద్ధం చేతల వరకు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసిన మరుసటి రోజే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రిపై మమతా బెనర్జీపై దాడి జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ దాడి పేరుతో ఆమె రాజకీయ లబ్ధికోసం డ్రామా ఆడుతున్నారని, సెక్యూరిటీని దాటుకుని వెళ్లి సీఎంపై దాడి చేసే ధైర్యం ఎవరికుంటుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
నందిగ్రామ్ లో ఆట మొదలు..
తనకు నమ్మకంగా ఉంటూ బీజేపీలో చేరిన సుబేందు అధికారిపై ప్రతీకారం కోసమే ఈ దఫా దీదీ నందిగ్రామ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ నామినేషన్ వేసి బయలుదేరే క్రమంలో ఆమె తనపై దాడి జరిగిందని చెబుతున్నారు. నందిగ్రామ్ లో బుధవారం నామినేషన్ వేసిన దీదీ 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం కోల్ కతా బయలుదేరుతున్న క్రమంలో ఆమెపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఓ గుడి దగ్గర కారు ఆపి బయటకు దిగి ప్రార్థన చేస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి కారు తలుపుని తోసేశారని, దాంతో తన కాలికి గాయమైందని దీదీ మీడియాకు వివరించారు. దాడి జరిగే సమయంలో స్థానిక పోలీసులు, డీఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడ లేరని అన్నారు దీదీ. తనపై ఏదో కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగిన వెంటనే ఆమెను కోల్ కతా తీసుకెళ్లి ఎస్.ఎస్.కె.ఎం ఆస్పత్రిలో చేర్పించారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ క్రమంలో 130 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నియంత్రించి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీని పరామర్శించేందుకు వచ్చిన గవర్నర్ జగ్ దీప్ ని కూడా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అటు మమతా బెనర్జీ పై జరిగిన దాడి గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
మమతపై దాడి జరిగిందనే విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ కోల్ కతాకు తీసుకొచ్చే క్రమంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. తనపై జరిగిన దాడి గురించి స్వయంగా ఆమే మీడియాకు వివరించారు, అనంతరం కారులోనే కుప్పకూలి పోయారు. ఆ తర్వాత పోలీసులు 130 కిలోమీటర్ల మేర రూట్ క్లియర్ చేసి ఆమెను కోల్ కతా తీసుకొచ్చారు.
అటు బీజేపీ నాయకులు మాత్రం మమతా సింపతీ డ్రామా ఆడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. చిన్న ఘటనను పెద్ద సీన్ చేస్తున్నారని మండిపడ్డారు. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందోనని అనుమానం వ్యక్తం చేశారు.