Telugu Global
NEWS

బెజవాడ కోసమే అమరావతి జ‌పం..

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ఉద్యమాన్ని మొదలు పెట్టించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ ఉద్యమంతో అనుకున్నంత పొలిటికల్ మైలేజీ రాకపోవడంతో పక్కనపెట్టారు. జోలె పట్టి ఊరూరా తిరుగడం మొదలు పెట్టిన రెండు రోజులకే ఆ యాత్ర అటకెక్కింది. అన్ని ప్రాంతాలనుంచి అమరావతికి మద్దతు కూడగట్టాలన్నా సాధ్యం కాకపోవడంతో ఉద్యమానికి క్రమక్రమంగా దూరం జరిగారు బాబు. అప్పుడప్పుడు కొడుకు లోకేష్ ని, ఇతర నాయకుల్ని ఆందోళనకారుల వద్దకు పంపిస్తూ మమ అనిపించారు. అయితే హఠాత్తుగా బెజవాడ […]

బెజవాడ కోసమే అమరావతి జ‌పం..
X

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ఉద్యమాన్ని మొదలు పెట్టించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆ ఉద్యమంతో అనుకున్నంత పొలిటికల్ మైలేజీ రాకపోవడంతో పక్కనపెట్టారు. జోలె పట్టి ఊరూరా తిరుగడం మొదలు పెట్టిన రెండు రోజులకే ఆ యాత్ర అటకెక్కింది. అన్ని ప్రాంతాలనుంచి అమరావతికి మద్దతు కూడగట్టాలన్నా సాధ్యం కాకపోవడంతో ఉద్యమానికి క్రమక్రమంగా దూరం జరిగారు బాబు. అప్పుడప్పుడు కొడుకు లోకేష్ ని, ఇతర నాయకుల్ని ఆందోళనకారుల వద్దకు పంపిస్తూ మమ అనిపించారు. అయితే హఠాత్తుగా బెజవాడ మున్సిపల్ ఎన్నికలకు ముందు చంద్రబాబుకి అమరావతి ఉద్యమం గుర్తొచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. విజయవాడలో వైసీపీ గెలిస్తే.. మూడు రాజధానులకు పరోక్షంగా ఇక్కడివారంతా మద్దతిచ్చినట్టేనని రెచ్చగొట్టారు. అక్కడితో ఆగలేదు గుంటూరు ప్రచారంలో మీకు దమ్ములేదా, పౌరుషం లేదా అంటూ ప్రజల్నే తిట్టిపోశారు. అయితే సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు అమరావతి ఉద్యమ కారులు ఎలక్షన్ కోడ్ ఉన్నా పట్టించుకోకుండా విజయవాడవైపుకి దూసుకు రావడం, పోలీసులు వారిని అడ్డుకోవడం అంతా ఓ పథకంలో భాగంగానే జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు నిజం చేస్తూ చంద్రబాబు మరుసటిరోజు అమరావతి శిబిరానికి వెళ్లారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. కౌరవ సభలో దుర్యోధనుడిలాగా జగన్ అమరావతి మహిళల్ని అగౌరవపరిచారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో.. బెజవాడ పేరెత్తలేదు కానీ.. పరోక్షంగా మున్సిపల్ పోల్స్ లో అమరావతికి మద్దతివ్వాలనే సందేశాన్ని పంపించారు చంద్రబాబు. బెజవాడ ఎన్నికలకోసమే అమరావతి డ్రామా అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణల్ని మరోసారి నిజం చేశారు.

పోలీసులకు వార్నింగ్..
మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులందరి రికార్డులూ భద్రంగా ఉంటాయని, అన్ని రోజులూ జగనే అధికారంలో ఉండరని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని కేసుల్నీ సమీక్షిస్తామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు రాజధాని మహిళలకు ఎదురైన పరిస్థితే.. రేపు పోలీసులూ ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. జగన్‌ భవిష్యత్తులో రాష్ట్రం విడిచి వెళ్లిపోవచ్చని, కానీ.. పోలీసు అధికారులు, వారి పిల్లలు ఇక్కడే ఉండాలని తీవ్రంగా హెచ్చరించారు. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పనిచేయండంటూ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది మంత్రులు అసెంబ్లీలో తన సంగతి చూస్తానని అన్నారని.. అసెంబ్లీకి వస్తే ఏంచేస్తారో తానూ చూస్తానని అన్నారు బాబు.

First Published:  10 March 2021 2:57 AM IST
Next Story