పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బీజేపీ..
ప్రజా ఉద్యమాల విషయంలో ఎప్పుడూ ముందుండే పవన్ కల్యాణ్ ఈసారి ఉక్కు పోరాటానికి మాత్రం దూరమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానిని కలుస్తానని గతంలో ప్రకటించిన ఆయన, ఆ తర్వాత ఆ దిశగా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర బీజేపీకూడా కేంద్రం ఆదేశాలతో పూర్తిగా స్టాండ్ మార్చుకోవడం, ప్రైవేటీకరణ ఆగదని, అది జరిగినా కంపెనీ మంచికేనని చెబుతున్నారు బీజేపీ నేతలు. నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ కూడా ప్రైవేటీకరణ ఆపాల్సిందేనని అన్నారు. […]
ప్రజా ఉద్యమాల విషయంలో ఎప్పుడూ ముందుండే పవన్ కల్యాణ్ ఈసారి ఉక్కు పోరాటానికి మాత్రం దూరమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానిని కలుస్తానని గతంలో ప్రకటించిన ఆయన, ఆ తర్వాత ఆ దిశగా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర బీజేపీకూడా కేంద్రం ఆదేశాలతో పూర్తిగా స్టాండ్ మార్చుకోవడం, ప్రైవేటీకరణ ఆగదని, అది జరిగినా కంపెనీ మంచికేనని చెబుతున్నారు బీజేపీ నేతలు. నిన్న మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ కూడా ప్రైవేటీకరణ ఆపాల్సిందేనని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబుని ఫాలో అవుతూ.. వైసీపీపై నిందలేశారు. తీరా ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిక్కచ్చి ప్రకటన తర్వాత అసలు స్పందించకుండానే ఆ అంశాన్ని వదిలేశారు.
గతంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ స్పందించిన తీరు, పాచిపోయిన లడ్డూలంటూ కేంద్రాన్ని నిలదీసిన తీరు సంచలనంగా మారింది. ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం కూడా ఆ స్థాయిలో ధీటుగా బదులివ్వకపోవడంతో అందరూ పవన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అయితే అంతలోనే పవన్ కల్యాణ్ బీజేపీతో స్నేహం మొదలు పెట్టడంతో హోదా విషయం మరుగున పడిపోయింది. ఇప్పుడు కూడా విశాఖ ఉక్కు వ్యవహారంలో పవన్ కల్యాణ్ బరిలో దిగితే ఆ స్పందనే వేరు అని అంచనా వేస్తున్నారు జనసైనికులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీకి కాస్తో కూస్తో బలం ఉన్నట్టు కనపడుతోంది. అందులోనూ గాజువాక పవన్ సొంత నియోజకవర్గం. అలాంటి జనసేనాని విశాఖ కేంద్రంగా జరుగుతున్న ప్రజా పోరాటం నుంచి పక్కకు తప్పుకోవడం న్యాయమేనా అని జనసైనికులే మథనపడుతున్నారు. ఉక్కు పోరాటంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న వేళ, కార్మికులు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఎదురు చూడటం సహజం. అలాంటి పోరాటానికి నాయకత్వం వహించే అవకాశాన్ని పవన్ కల్యాణ్ చేతులారా వదిలేసుకున్నరనే వాదన కూడా వినపడుతోంది. పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి పవన్ ఉక్కు కార్మికులకు మద్దతుగా నిలబడితే ఆ కిక్కే వేరప్పా అనేవారు కూడా ఉన్నారు. కానీ బీజేపీ, పవన్ కల్యాణ్ చేతులు కట్టేసింది. రాష్ట్ర పార్టీ నేతలు ఉక్కు విషయంలో నోరు మెదపకూడదని ఎలా కండిషన్ పెట్టిందో.. మిత్రపక్షానికి కూడా అదే నిబంధన విధించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి దూరంగా ఉండిపోయారు. స్థానికంగా వచ్చే పొలిటికల్ మైలేజీని శాశ్వతంగా కోల్పోయారు.